2024-25 సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ను జూలై 31లోగా సమర్పించాలి. దీని కోసం ఐటీఆర్ 1 నుంచి 7 వరకూ వివిధ రకాల ఫారాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎవరు ఏ ఐటీఆర్ ఫారం సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఏడు రకాల ఐటీఆర్ ఫారాలను ఆదాయపు శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యక్తుల నుంచి కంపెనీల వరకూ కేటగిరీల వారీగా వీటిిని వినియోగించాలి. ముఖ్యంగా తాము ఏ ఫారం సమర్పించాలో చెల్లింపుదారులకు తెలియాలి. దీని వల్ల సకాలంలో ఐటీఆర్ దాఖాలు చేయడంతో పాటు, తిరస్కరణకు గురయ్యే ప్రమాదం తప్పుతుంది.
వ్యక్తులు
జీతం పొందే ఉద్యోగులు, ఫీలాన్సర్లు, నిపుణులు తమ ఆదాయానికి అనుగుణంగా పన్ను కట్టాలి. వీరిని జనరల్, సీనియర్ (60-80 ఏళ్లు), సూపర్ సీనియర్ (80 ఏళ్లకు పైగా)గా విభజించారు. వీరిలో రూ.50 లక్షల వరకూ జీతం రూపంలో ఆదాయం పొందే వారు ఐటీఆర్-1 (సహజ్), మూలధన లాభాలు, బహుళ ఆస్తులున్న వారు ఐటీఆర్-2, వ్యాపారం, ప్రొఫెషన్ నుంచి ఆదాయం వచ్చే వారు ఐటీఆర్-3, అలాగే సెక్షన్లు 44ఏడీ, 44ఏడీఏ, 44 ఏఈ కింద ఊహజనిత ఆదాయం కోసం ఐటీఆర్-4 (సుగమ్)ను దాఖాలు చేయాలి.
హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్ యూఎఫ్)
హెచ్ యూఎఫ్ అంటే అవిభక్త కుటుంబం అని అర్థం. దీన్ని చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఒక హిందూ వ్యక్తి పెళ్లిచేసుకున్నప్పుడు అతడి కుటుంబం దీనికి కిందకు వస్తుంది. హిందువులతో పాటు జైనులు, సిక్కులు, బౌద్ధులు కూడా హెచ్ యూఎఫ్ లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ఉమ్మడి పూర్వికులతో కలిసి ఉన్న కుటుంబ యూనిట్ అని చెప్పవచ్చు. వీరు తమ ఆదాయ వనరులను బట్టి ఐటీఆర్-2, ఐటీఆర్-3, ఐటీఆర్-4 ఫారాలను సమర్పించాలి.
ఇవి కూడా చదవండి
కంపెనీ
కంపెనీ చట్టం కింద నమోదైన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు దీని కిందకు వస్తాయి. నిబంధనల ప్రకారం కార్పొరేట్ పన్నులు, కనీస ప్రత్యామ్నాయ పన్నులు విధిస్తారు. ఈ కంపెనీలు ఐటీఆర్-6ను సమర్పించాలి.
భాగస్వామ్య సంస్థలు
భాగస్వామ్య సంస్థలు, ఎల్ఎల్పీలు ఐటీఆర్ -5 ఫారం అందజేయాల్సి ఉంటుంది. వీటి మొత్తం ఆదాయంపై 30 శాతం ప్లాట్ పన్ను రేటు ఉంటుంది. అదనంగా సర్ చార్జి, సెస్ వర్తింప జేస్తారు.
వ్యక్తుల సంఘాలు
ఒక ప్రయోజనం కోసం కలిసి పనిచేసే వ్యక్తులు, సంస్థల సమూహాలు దీని కిందకు వస్తాయి. నిర్ధిష్ట పరిస్థితుల ఆధారంగా వ్యక్తిగత రేట్లు, గరిష్ట మార్జినల్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. వీరు ఐటీఆర్ -5 ఫారం సమర్పించాలి.
స్థానిక సంస్థలు
పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థలు ఈ కేటగిరీలోకి వస్తాయి. వాణిజ్య కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయంపై పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే వీటికి నిబంధనల ప్రకారం కొన్ని ఆదాయాలను మినహాయింపు పొందవచ్చు. ఇవి ఐటీఆర్-5 ఫారాన్ని దాఖలు చేయాలి.
ఆర్టిఫీషియల్ జురిడికల్ పర్సన్ (ఏజేపీ)
పైన తెలిపిన వాటిలో లేని ట్రస్టులు, సొసైటీలు, చట్టపరమైన సంస్థలు ఈ కోవలోకి వస్తాయి. ఆ సంస్థ స్వభావం, ఆదాయం ఆధారంగా పన్ను విధిస్తారు. వీరిలో జనరల్ ఏజేపీలు ఐటీఆర్-5, చారిటబుల్ ట్రస్టులు ఐటీఆర్-7 ఫారాలను పంపించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి