పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మంది చెప్పినట్లు హీరోలకు అభిమానులు ఉంటారు.. కానీ పవన్ కు మాత్రం భక్తులు ఉంటారు. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆయన రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. కానీ విజయం మాత్రం అంత సులువుగా దక్కలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం ఒక అసెంబ్లీ సీటును మాత్రమే గెల్చుకుంది. ఇక పవన్ అయితే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చారు. తాను గెలవడమే కాకుండా 21 స్థానాల్లో పోటీ చేసిన తన పార్టీ సభ్యులను కూడా గెలిపించుకున్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్‌తో రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవన్. అదే సమయంలో ఎన్నికలకు ముందు తను ఒప్పుకున్న సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో బిజీగా ఉంటున్నారు. అయితే పవన్ ఇలా సినిమాలు, రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఏం చేసేవారో తెలుసా? ఈ విషయం గురించి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉదయగిరి ఫయాజ్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. ఆయనది ఒక సపరేట్ స్కూల్. ప్రత్యేక ప్రపంచం. నేను ఒకసారి పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లాను. అప్పుడే షూటింగ్ మూగించుకుని ఇంటికి వచ్చిన ఆయన చాలా సాదాసీదాగా ఉన్నారు. ఆ సందర్భంలో పవన్ ను చాలా విషయాలు అడిగాను. ఆయన కూడా ఎంతో ఓపికగా తన పర్సనల్ విషయాలను ఎంతో ఓపెన్ గా షేర్ చేసుకున్నారు. ఇదే క్రమంలో సినిమా యాక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు? అని పవన్ ను అడిగాను. ఆయన ‘తోటమాలి’ అయ్యేవాడిని అని ఆన్సరిచ్చారు. దానికి నాకు నవ్వు వచ్చింది. ఆ వెంటనే పవన్ ‘ అవునండి.. నాకు అంతకన్నా ఏమీ రాదు. నిజంగా సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఒక నర్సరీ పెట్టుకుని హాయిగా మొక్కల మధ్య గడిపేవాడిని. నేను ఒక చోట పెద్ద అడవిని కూడా పెంచుతున్నాను. అక్కడ నాకు ఇష్టమైన మొక్కలన్నీ పెంచుతున్నాను. చెట్లు కూడా ఉన్నాయి’ అని పవన్ చెప్పారని సీనియర్ జర్నలిస్ట్ ఉదయగిరి ఫయాజ్ అప్పటి సంగతులు షేర్ చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.