చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వేసవిలో చెమట ఎక్కువగా పట్టి బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం బయటికి వెళ్లే ముందు.. రాత్రి పడుకునే ముందు పూర్తిగా చెమట లేకుండా స్నానం చేయడం మంచిది. స్నానానికి మెత్తని బాడీ వాష్ లేదా హెర్బల్ క్లీన్సర్ వాడండి.
వారానికి రెండు, మూడు సార్లు బాడీ స్క్రబ్ వాడటం వల్ల చర్మంపై పేరుకుపోయే మృతకణాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మ రంధ్రాలు శుభ్రంగా ఉంటాయి. సహజ పదార్థాలతో తయారైన స్క్రబ్ లను వాడితే చర్మానికి ఎలాంటి హాని ఉండదు.
చర్మానికి గాలి తగిలేలా ఉండే దుస్తులు ధరించడం మొటిమల నివారణకు చాలా అవసరం. నైలాన్ లేదా పాలిస్టర్ లాంటి సింథటిక్ బట్టల్లో చెమట చిక్కుకుని చర్మాన్ని పాడుచేస్తుంది. అందుకే కాటన్ లాంటి సహజమైన బట్టలు వేసుకుంటే చర్మానికి గాలి బాగా ఆడుతుంది.
వ్యాయామం చేశాక వెంటనే స్నానం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం వల్ల వచ్చే చెమట ఎక్కువసేపు శరీరంపై ఉంటే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జిమ్ తర్వాత వెంటనే చర్మాన్ని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి.
మొటిమలను తాకడం వల్ల వాటి చుట్టూ ఉన్న బ్యాక్టీరియా మరింత పెరుగుతుంది. మొటిమలను గిల్లితే చర్మంపై గాయాలు, మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి మొటిమలను తాకకుండా ఉండటం వల్ల సమస్య మరింత తీవ్రం కాకుండా నివారించవచ్చు.
రోజంతా ఎక్కువగా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీరు తాగడం వల్ల చర్మం సహజంగా మెరిసిపోతుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని రోజూ తినండి. పండ్లు, తాజా కూరగాయలు, నట్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు చర్మానికి బలాన్ని ఇస్తాయి. దోసకాయ, టమాటా, క్యారెట్ లాంటివి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.
సాలిసిలిక్ యాసిడ్ లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ కలిగిన బాడీ వాష్ లు, క్రీమ్ లు శరీర మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని వాడే ముందు చర్మ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అవసరమైతే డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవడం మంచిది.