India vs England Test Series: భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీమిండియా టెస్ట్ స్క్వాడ్ ప్రకటన శనివారం మే 24న ముంబైలో జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించనున్నారు. ఈ స్క్వాడ్ ప్రకటనలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన నేపథ్యంలో కొత్త కెప్టెన్ ఎంపిక, యువ ఆటగాళ్లకు అవకాశంపై అందరి దృష్టి ఉంది.
కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్?
రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో, కొత్త సారథిగా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించిన అనుభవం, అతని బ్యాటింగ్‌లో పరిణతి అతనికి కలిసొచ్చే అంశాలు. జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికీ, గిల్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
సాయి సుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు టెస్ట్ అరంగేట్రం?
ఈ టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యే జట్టులో కొత్త ముఖాలు కనిపించే అవకాశం ఉంది. యువ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్, ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సాయి సుదర్శన్ దేశవాళీ క్రికెట్‌లోనూ, ఇటీవల ఐపీఎల్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓపెనర్‌గా, అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా అతను జట్టుకు బలం చేకూర్చగలడు.
అర్ష్‌దీప్ సింగ్ టీ20, వన్డే క్రికెట్‌లో ఇప్పటికే తన సత్తా చాటాడు. ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో కూడా అతనికి అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. ఇంగ్లాండ్ పిచ్‌లపై అతని స్వింగ్ బౌలింగ్ ప్రభావం చూపగలదని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. మొహమ్మద్ షమీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యే అవకాశం ఉండటంతో, అర్ష్‌దీప్ సింగ్ లాంటి యువ పేసర్‌కు ఇది చక్కటి అవకాశం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..