ఐపీఎల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితేనేం ఇప్పటివరకు పలు రికార్డులు ఇంకా బద్దలు కాలేదు. అయితే ఇటీవల ఓ యమకింకరుడు వన్డేల్లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డును బద్దలుకొట్టాడు. గత 10 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేశాడు విండీస్ బ్యాటర్. అతడెవరో కాదు వెస్టిండీస్ మిడిలార్డర్ బ్యాటర్ మాథ్యూ ఫోర్డ్. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. డివిలియర్స్ రికార్డును సమం చేశాడు.
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో ఫోర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్ 100 పరుగులకు పైగా తేడాతో గెలిచి వెస్టిండీస్‌ను ఆశ్చర్యపరచగా.. ఎలాగైనా గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు మాంచి శుభారంభం లభించింది. వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. దీనికి ముఖ్య కారణంగా మ్యాథ్యూ ఫోర్డ్, కేసీ కార్టీ. ఈ ఇన్నింగ్స్‌లో హీరో కేసీ కార్టీ అయినప్పటికీ, అతడి అద్భుతమైన సెంచరీని అధిగమించింది మాథ్యూ ఫోర్డ్ తుఫాన్ ఇన్నింగ్స్. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. పెను విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ 44వ ఓవర్ రెండవ బంతికి బ్యాటింగ్‌కు వచ్చి తదుపరి నాలుగు ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించాడు కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఫోర్డ్. ఐరిష్ బౌలర్లను చిత్తు చేసిన ఫోర్డ్ కేవలం 16 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీనితో అతడు 2015లో ఏబీ డివిలియర్స్ చేసిన ప్రపంచ రికార్డును సమం చేశాడు.
ఈ వెస్టిండీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేవలం 19 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. 305 స్ట్రైక్ రేట్‌తో 8 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. ఫోర్డ్‌తో పాటు వెస్టిండీస్ నెంబర్ త్రీ బ్యాటర్ కేసీ కార్టీ 109 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అలాగే కెప్టెన్ షాయ్ హోప్ 49 పరుగులు చేయగా, జస్టిన్ గ్రీవ్స్ 36 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో లియామ్ మెక్కార్తీ 3 వికెట్లు పడగొట్టగా, బారీ మెక్కార్తీ 2 వికెట్లు తీశాడు.