
వేసవి కాలం చాలా సమస్యలను తెస్తుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయానికి వస్తే తీవ్రమైన సూర్యకాంతి, వేడి గాలుల కారణంగా చర్మం టాన్ అవ్వడం సర్వసాధారణం. దీంతో ముఖ సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ చూపించే మనం.. చేతుల విషయంలో కేరింగ్ ను విస్మరిస్తాము. అయితే చేతులకు కూడా జాగ్రత్త అవసరం. ప్రత్యక్షంగా సూర్య కిరణాలు తాకడం వలన చేతుల రంగును మారుస్తాయి. అవి పొడిగా, ముదురు రంగులో కనిపిస్తాయి.
టానింగ్ తొలగించడానికి మార్కెట్లో అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్నిసార్లు అవి ఖరీదైనవి, కొన్నిసార్లు రసాయనాల కారణంగా ప్రజలు వాటిని ఉపయోగించడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో సురక్షితమైన, సులభమైన పరిష్కారం వంటింటి చిట్కాలు. ఇంట్లో దొరికే పదార్థాలతో తయారుచేసిన మాస్క్‌లు టానింగ్‌ను తగ్గించడమే కాదు చర్మానికి పోషణనిచ్చి, స్కిన్ కు సహజ మెరుపును తిరిగి ఇస్తాయి. కనుక వేసవిలో టానింగ్ వల్ల ప్రభావితమైన చేతుల రంగును మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని సులభమైన, ప్రభావవంతమైన ఇంట్లో తయారుచేసే మాస్క్‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
శనగపిండి, పసుపు, పెరుగు మాస్క్
వేసవిలో చేతులపై వచ్చే టానింగ్‌ను తొలగించడానికి శనగపిండి మాస్క్ ఒక అద్భుతమైన నివారణ. దీని కోసం 2 చెంచాల శనగపిండి, 1 చిటికెడు పసుపు , 1 చెంచా పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీని తర్వాత దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసుకుని 20 నిమిషాల తర్వాత చేతులు కడుక్కోవాలి. ఈ మాస్క్ ట్యానింగ్‌ను తొలగించడమే కాదు చర్మాన్ని తేమగా కూడా ఉంచుతుంది.
కలబంద, నిమ్మకాయ మాస్క్
దీన్ని తయారు చేయడానికి 1 టీస్పూన్ నిమ్మరసంలో 2 టీస్పూన్ల కలబంద జెల్ కలిపి పేస్ట్ లా చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు, టాన్ అయిన ప్రాంతాలకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. కలబంద చర్మాన్ని చల్లబరుస్తుంది. అదే సమయంలో నిమ్మకాయ టానింగ్‌ను తేలికపరుస్తుంది.
బంగాళాదుంప, రోజ్ వాటర్ మాస్క్
టానింగ్ తొలగించడంలో బంగాళాదుంప కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు దీన్ని నేరుగా మీ చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే తురిమిన బంగాళాదుంపలకు రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా చేయండి. ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి ఆరనివ్వండి. తర్వాత నీటితో కడగాలి. బంగాళాదుంపలు చర్మ ఛాయను ప్రకాశవంతం చేసే సహజ బ్లీచింగ్ ఏజెంట్లను కలిగి ఉంటాయి.
టమోటా, తేనె పేస్ట్
టమోటాను మెత్తగా చేసి దానికి తేనె కలపండి. ఈ పేస్ట్ ని చేతులకు అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. టమోటా సన్ టాన్ తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. తేనె చర్మాన్ని తేమగా చేస్తుంది.
కీర దోస, ముల్తానీ మిట్టి మాస్క్
2 చెంచాల కీర దోస రసం, 1 చెంచా ముల్తానీ మట్టిని కలిపి పేస్ట్ లా చేసి చేతులకు అప్లై చేయండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ మాస్క్ చర్మాన్ని చల్లబరుస్తుంది. టానింగ్ తగ్గిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)