ఇటీవల కాలంలో మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మానవ తప్పిన ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు పెట్టినా.. వాహనదారులు మాత్రం ఉల్లంఘిస్తూనే ఉంటారు. కొందరు తమ నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకుని కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. తాము ఎదుర్కొన్న కడుపు కోతా మరే తల్లిదండ్రులకు రావద్దు అంటూ ఆ తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన అంతటి అంజయ్య, సావిత్రమ్మ దంపతులు గీత కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు అజయ్ కుమార్ గౌడ్(26) ఓ ఫార్మసీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇంటికి పెద్ద కొడుకు కావడంతో స్థానికంగా ఉంటూ, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మే నెల 18వ తేదీన వలిగొండలోని ఓ వివాహానికి అజయ్ కుమార్‌గౌడ్ బైక్‌పై వెళ్లాడు. పెళ్లికి హాజరై రాత్రివేళ వెలిమినేడుకు తిరుగు ప్రయాణమయ్యాడు. వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామ పరిధిలోకి రాగానే బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. దీంతో అజయ్ కుమార్ కాల్వలో పడిపోవటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.
చేతికి అంది వచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తీరని గర్భశోకంతో ఆ తల్లిదండ్రులు అల్లాడిపోయారు.తల్లిదండ్రులు నిర్వహించిన అజయ్ కుమార్ గౌడ్ దశదినకర్మ కార్యక్రమంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో.. ‘నేను హెల్మెట్ ధరించి ఉంటే ఈ రోజు మీ అందరితో కలిసి ఉండేవాడిని.. బైక్ నడిపే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలి’ అంటూ అజయ్ కుమార్‌గౌడ్ మాట్లాడినట్లుగా కుటుంబ సభ్యులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లను గ్రామంలోని రెండు చోట్లు ఏర్పాటు చేశారు.
ప్రాణం విలువ తెలిసేలా చేస్తున్న ఈ ఫ్లీక్సీలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. హెల్మెట్ ధరించకపోవటంతో రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోయామని, తమకు మిగిలిన కడుపుకోత మరే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు గర్భ శోకం రాకూడదంటే యువకులు హెల్మెట్ ధరించాలని కోరుతున్నారు. కుటుంబ సభ్యులు రూపొందించిన పోస్టర్ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. వాహనదారుల్లారా.. బైక్ ఎక్కేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..