వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వంశీని శుక్రవారం అర్థరాత్రి కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు పోలీసులు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడ్డ వంశీ స్టేషన్‌లోనే వాంతులు చేసుకున్నారు. దీంతో ఆయన్ను కంకిపాడు పోలీసు స్టేషన్ నుంచి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కంకిపాడు స్టేషన్‌కు తరలించారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రంతా ఉన్న వల్లభనేని వంశీకి వైద్యులు చికిత్స అందించారు.
కాగా.. నకిలీ ఇళ్లపట్టాల కేసులో వంశీని రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది నూజివీడు కోర్టు. ఇవాళ్టితో వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగియనుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి కంకిపాడు పోలీసు స్టేషన్‌లో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తీసుకెళ్లారన్న సమాచారంతో అక్కడకు చేరుకున్నారు వంశీ సతీమణి పంకజశ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని.. అనంతరం వంశీని పరామర్శించారు.
పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. పరిస్థితి సీరియస్ గా ఉంటే విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేస్తామని వైద్యులు చెబుతున్నారన్నారు. పోలీస్టేషన్ లోనే వంశీ వాంతులు చేసుకున్నారన్నారు. ప్రభుత్వాన్ని నడిపేవారికి విజ్ఞప్తి చేస్తున్నాం.. కక్ష ఉంటే ఏడాది జైల్లో వేసుకోండి.. కానీ మనిషిని చంపి పైశాచికానందం పొందాలనుకోవడం సరికాదంటూ పేర్కొన్నారు. వంశీ మీద ఒకదాని వెంట ఒకటి తప్పుడు కేసులు పెడుతున్నారు.. అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తీసుకెళ్లి బాగోకపోయినా ఆరోగ్యం బాగుందని రాసి పంపిస్తున్నారంటూ నాని ఆరోపించారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో వంశీ తప్పుచేశారని చెబుతన్నారని.. తప్పుడు కేసులతో విచారణ చేస్తే ప్రజలు హర్షించరన్నారు. వేలాది మంది వైసీపీ కార్యకర్తలను కొట్టడం.. నడవడం లేకుండా చేస్తున్నారని.. ఎవడ్ని కొట్టమంటే వాడిని కొట్టే స్థితికి పోలీసులను తెచ్చారని పేర్ని నాని ఆరోపించారు. రేపైనా పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..