బీహార్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గోపాల్‌గంజ్‌లో జరుగుతున్న వివాహ వేడుకలో కొంతమంది దుండగులు పెళ్లి మండపం నుండి వరుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడంతో గందరగోళం నెలకొంది. ఈ సంఘటన శనివారం (మే 24) తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు. జయమాల వేడుక పూర్తయింది. వధూవరులు ఇంకా వేదికపై కూర్చుని ఉన్నారు. పండితులు మంత్రాలు పఠిస్తున్నారు. అప్పుడు ఆకస్మాత్తుగా చొరబడ్డ దుండగులు వరుడిని తీసుకుని వెళ్లిపోయారు.
సాధు చౌక్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో వధువు తోపాటు ఆమె కుటుంబ సభ్యులను దారుణంగా కొట్టారు. ఇల్లు కూడా దోచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వరుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వివాహ ఊరేగింపులో వినోదం అందించడానికి పిలిచిన లాండా నాచ్ పార్టీ సభ్యులే ఈ కిడ్నాప్, దాడికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
సురేంద్ర శర్మ కుమార్తె వివాహ ఊరేగింపు బైకుంత్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దిగ్వా దుబౌలి నుండి వచ్చింది. పెళ్లికి వచ్చిన అతిథులను అలరించడానికి, అబ్బాయి తరపు వారు లాండా డాన్స్ పార్టీని ఏర్పాటు చేశారు. పాటలు పాడుతూ, నృత్యం చేస్తుండగా, ఏదో ఒక విషయంపై వివాదం తలెత్తింది. అది కాస్తా హింసాత్మకంగా మారింది. గొడవ సమయంలో, లాండా నాచ్ పార్టీకి చెందిన బృందం సభ్యులు వధువు తలుపు వద్దకు చేరుకుని అక్కడ ఉన్న వారిని కొట్టారు. ఈ దాడిలో వధువు, ఆమె తల్లితో సహా చాలా మంది మహిళలు గాయపడ్డారు. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి నగలు, విలువైన వస్తువులను దోచుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో, మండపంలో కూర్చున్న వరుడిని కూడా వదిలిపెట్టకుండా, అతన్ని కొట్టి, బలవంతంగా కారులో కూర్చోబెట్టి కిడ్నాప్ చేశారు.
ఈ దారుణం గురించి సమాచారం అందిన వెంటనే, నగర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికి నిందితులు పారిపోయారు. వరుడు ఇంకా కనిపించడం లేదు. కుటుంబం షాక్‌లో ఉంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వివాహ వాతావరణం పూర్తిగా శోకసంద్రంగా మారింది. ఈ విషయాన్ని పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారని సదర్ ఎస్‌డిపిఓ ప్రాంజల్ త్రిపాఠి తెలిపారు. వరుడిని సురక్షితంగా విడిపించడానికి గోపాల్‌గంజ్‌తో పాటు, బరౌలి, సివాన్ పోలీసుల సహాయం కూడా తీసుకుంటున్నారు. అయితే, సంఘటన జరిగి 24 గంటలు గడిచినా, వరుడు కనిపించకపోవడంతో వధువు వైపు నుంచి తీవ్ర గందరగోళం నెలకొంది. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని, వరుడిని తిరిగి తీసుకువస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతానికి కేసు మిస్టరీగానే ఉంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..