
కడప జిల్లాలోని గువ్వల చెరువు ఘాట్ ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. దాదాపు 14 కిలోమీటర్ల పైబడి ఉండే ఈ ఘాట్‌లో పదికి పైగా మలుపులు ఉన్నాయి. ఆ మలుపుల వద్ద స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సంఘటన ఇప్పుడు మరొకటి జరిగింది. బెంగళూరు నుంచి బద్వేల్‌లోని సొంత గ్రామానికి వస్తున్న ఓ కుటుంబం మృత్యువాత పడింది. గువ్వలచెరువు ఘాట్ లోని చింతకొమ్మదిన్నె మండలం వైపు ఉన్న నాలుగో మలుపు వద్ద ప్రమాదం సంభవించింది. యూరియా లోడ్ తో వస్తున్న లారీ వెనుక నుంచి వచ్చి కారుపైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని కడప రిమ్స్ కు తరలించారు. బెంగళూరు నుండి బద్వేల్ మండలం చింతపుత్తలపల్లె కు గ్రామంలో శుభకార్యానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గువ్వలచెరువు ఘాట్ రోడ్డు నాలుగవ మలుపు వద్దకు కారు రాగానే వెనుక వైపు నుంచి యూరియా లోడ్ తో లారీ అతివేగంగా వచ్చి ఢీకొంది. ఆ వేగానికి లారీ కారుపై పడడంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను శ్రీకాంత్, శిరీష్, హర్షిణి, రిషిగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారుపై పడ్డ లారీని తీసేందుకు దాదాపు రెండు గంటలకు పైగా శ్రమించారు. మొత్తం 7 మంది కారులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యాక్సిడెంట్ ప్రదేశంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మృతదేహాలను వెలికి తీసి కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. గాయపడిన వారిని కూడా కడప రిమ్స్ కు తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..