vijayawada bomb threat call: పోలీసులు విజయవాడలో హై అలర్ట్ ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తి బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ భవనంలో బాంబు పెట్టామని ఫోన్ చేయడంతో కలకలం రేగింది. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసి, ట్రాఫిక్ మళ్లించి విస్తృతంగా గాలించారు. చివరికి బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలు ఈ బెదిరింపు వెనుక ఎవరున్నారు అనే పూర్తి వివరాలు మీకోసం..
హైలైట్:
- విజయవాడలో హైఅలర్ట్
- బాంబులు పెట్టామంటూ కాల్
- బీసెంట్ రోడ్డులో ముమ్మర తనిఖీలు

విజయవాడ వాసులను బాంబు కాల్ భయాందోళనకు గురి చేసింది. స్థానిక బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ భవనంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయడం సంచలనంగా మారింది. శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ బెదిరింపు కాల్ వచ్చింది. ఓ అజ్ఞాత వ్యక్తి కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి.. విజయవాడ బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ భవనంలో బాంబులు పెట్టామని చెప్పాడు. పైగా మరికాసేపట్లో అవి పేలే అవకాశం ఉందని చెప్పి కాల్ కట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.
పోలీసులు మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి.. బందర్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు వరకు కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్‌ను సంఘటన స్థలానికి రప్పించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీనికోసం బీసెంట్ రోడ్డులోని దుకాణాలు, కార్యాలయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేయించారు. ట్రాఫిక్‌ను సైతం మళ్లించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
అలానే పోలీసులు, బాంబు స్క్వాడ్.. బీసెంట్ రోడ్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ ప్రాంతంలోని ప్రతి షాపు, తోపుడు బండ్లను బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించింది. చివరకు ఎక్కడా బాంబ్ ఉన్న ఆనవాళ్లు లేకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు లేకపోవడంతో శనివారం మధ్యాహ్నం నుంచి బీసెంట్ రోడ్‌లో వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు పోలీసులు.
అలాగే కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫోన్‌కాల్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు చేశారు అనేదానిపై వారు ఆరా తీస్తున్నారు. కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి వంటి సంఘటనలతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఇలా బాంబు బెదిరింపు రావడం సంచలనంగా మారింది.