
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అధికార యంత్రాంగం, రెస్క్యూ సిబ్బంది మొత్తం క్షేత్రస్థాయిలో నిర్విరామంగా సేవలు అందిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అలుపు లేకుండా పర్యటిస్తూ బాధితులకు సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి.. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే.. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తాను వెళ్తే జనం, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అంతా తన చుట్టే ఉంటారని.. అప్పుడు బాధితులకు సహాయక చర్యలు అందడంలో ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. వరద బాధితులను కలవడంలో తనకు ఎలాంటి సమస్య లేదని చెప్పిన ఉప ముఖ్యమంత్రి.. అలా చేస్తే వరద బాధితులకు సహాయం కాస్తా సమస్యగా మారుతుందని చెప్పారు.
ఈ క్రమంలోనే తన వంతుగా రాష్ట్రంలో వరద బాధితులకు సొంతంగా కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబును కలిసి చెక్కు అందజేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో వరద పరిస్థితిని విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి పరిశీలించారు. ఈ సమీక్షలో రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
ప్రస్తుతం వరద తగ్గుతోందని.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం తీరు వల్లే ప్రస్తుతం ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. ప్రస్తుతం పెద్ద ప్రమాదం తప్పిందని.. సహాయం కోసం ప్రజలు 112, 1070, 18004250101 నంబర్లకు ఫోన్ చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రకృతి విపత్తు సమయంలో ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనేది కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి నగరానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని.. వరద నిర్వహణ కోసం బృహత్తు ప్రణాళిక తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.

