
మరోవైపు విజయవాడ- కాజీపేట సెక్షన్‌లో వర్షాలకు దెబ్బతిన్న ట్రాక్‌ను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చెరువుల నుంచి నీటి ప్రవాహం వస్తుండడంతో పాటుగా వర్షం కురుస్తుండటంతో పనులు ఆలస్యం అవుతున్నాయి. తాళ్లపూసపల్లి-మహబూబాబాద్ మధ్య పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. అలాగే ఇంటికన్నె-కె.సముద్రం మధ్య ట్రాక్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. బుధవారం సాయంత్రానికి రైళ్ల రాకపోకల్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలనే టార్గెట్‌గా పనిచేస్తున్నారు.
తాళ్లపూసపల్లి-మహబూబాబాద్, ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైలు పట్టాల మీదుగా.. శనివారం అర్ధరాత్రి దాటాక భారీగా వరద ప్రవహించింది. ఈ వరద దెబ్బకు రైలు పట్టాల కింద మట్టి, కంకర కొట్టుకుపోగా.. వెంటన మరమ్మత్తుల పనులు చేపట్టారు. ప్రత్యేక మాన్సూన్ రైలులో స్లీపర్లు, రెయిల్స్, బండరాళ్లు, కంకరను రైల్వే అధికారులు అక్కడికి తరలించారు. ఆ మార్గంలో పట్టాలు వేలాడుతున్న ప్రాంతంలో కింది భాగాన్ని బండరాళ్లు, కంకర, మొరంతో రైల్వే సిబ్బంది నింపేస్తున్నారు. వర్షం పడుతుండటంతో నీటి ప్రవాహం అడ్డంకిగా మారగా.. పెద్దపెద్ద బండరాళ్లతో అడ్డుకట్టలా వేస్తున్నారు. ముదుగా బుధవారం మధ్యాహ్నంలోపు ఒక లైన్‌ని పునరుద్ధరించి రైళ్ల రాకపోకల్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. సాయంత్రానికి రెండో లైన్‌నూ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

