వాస్తవానికి పాము అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి..! అది కూడా అత్యంత విషపూరిత పాముల్లో ఒకటైన రక్త పింజరి కనిపిస్తే.. సామాన్యులే కాదు, ఫారెస్ట్ అధికారులు చివరకు పాములు పట్టే నేర్పరి గల స్నేక్ క్యాచర్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు. ఎందుకంటే అంత చురుగ్గా ఆ పాము ఉంటుంది. చాలా ప్రమాదకరమైనది.. దూకుడు స్వభావం కలిగి ఉంటుంది. ఈ పాము కాటు వేసిన వెంటనే శరీరంలో అంతర్గత రక్తస్రావం జరిగి క్షణాల్లో మనిషి ప్రాణాలు కోల్పోతాడు.
గోతిలోని బాటిల్‌లో దాక్కుని..!
ప్రపంచ యోగ దినోత్సవం వేడుకలు విశాఖలో విజయవంతమయ్యాయి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దారి పొడవున యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డులో జనం భాగస్వామ్యం అయ్యారు. అయితే.. ఫారెస్ట్ ఏరియ కి అనుసంధానమై ఉన్న బీచ్ రోడ్‌లో పాములు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. ఫారెస్ట్ అధికారులను అప్రమత్తం చేశారు. స్నేక్ క్యాచర్లను కూడా రంగంలోకి దింపారు. పాములు బీచ్ రోడ్డు వైపు రాకుండా.. ఆయా ప్రాంతాల్లో వేప నూనె, లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా స్ప్రే చేశారు. ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా పాముల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎట్టకేలకు యోగా డే వేడుకలు విజయవంతంగా ముగిసాయి. అయితే.. యోగ ఆసనాలు వేసేందుకు వచ్చేవారికోసం ఎక్కడ ఎక్కడ బయో టాయిలెట్లను ఏర్పాటు చేసింది యంత్రంగం. అందుకోసం చిన్న చిన్న గోతులను తవ్వింది. యోగా డే వేడుకలు ముగిసిన తర్వాత ఆ బయోటాయిలెట్లను తొలగించి తీసుకెళ్లారు. సాగర్ నగర్ వద్ద టాయిలెట్లను ఏర్పాటు చేసిన ప్రాంతంలో.. ఆ మరుసటి రోజే ఓ పాము భయపెట్టింది. బయో టాయిలెట్‌ల కోసం తీసిన గోతిలో పాము కనిపించింది. దీంతో ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. బాటిల్‌లో దాగివున్న పామును చూసి ఫారెస్ట్ అధికారులే గుండెలు పట్టుకున్నారు. ఎందుకంటే సాధారణ పాము కాదు.. అత్యంత విషపూరితమైన రస్సెల్ వైపర్. వెంటనే స్నేక్ కేచర్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్.. బాటిల్‌లో దాగివున్న రక్తపింజర పామును రెస్క్యూ చేశారు. అటవీ అధికారుల సమక్షంలో.. కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ లో సేఫ్‌గా దాన్ని విడిచి పెట్టారు. దీంతో ఫారెస్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆరోజు వచ్చి ఉంటే..!
యోగా దినోత్సవ వేడుకలు జరిగిన మరుసటిరోజే.. అది కూడా బయో టాయిలెట్లు ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే రక్తపింజర కనిపించడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. సాగర్ నగర్ బీచ్ ఏరియా పాముల సంచరించే ప్రాంతం. మందు జాగ్రత్తగానే అటవీశాఖ అధికారులు పాముల రాకుండా స్ప్రేయింగ్ చేశారు. యోగా డే వేడుకల్లో ఎటువంటి చిన్నపాటి ఇన్సిడెంట్ కూడా లేకుండా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. వేడుకలు ముగిసిన మరుసటిరోజే అదే ప్రాంతంలో రక్త పింజరి కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. అది కూడా బయో టాయిలెట్‌ల కోసం తీసిన గోతిలో కనిపించింది ఆ రసల్స్ వైపర్. ఒకవేళ యోగా డే రోజున అది గాని ఆ ప్రాంతంలో సంచరించి ఉంటే.. కచ్చితంగా ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉండేదని అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. తాము చేసిన స్ప్రేయింగ్ వల్లే యోగా డే రోజు పాములు పరిసర ప్రాంతాల్లో రాలేదని పేర్కొన్నారు.
అది మామూలు పాము కాదు..
రక్త పింజరి పాము చాలా విషపూరితమైనది. దీన్ని కాటుక రేకుల పాము అని కూడా పిలుస్తారు. ఈ పాము వల్లే అత్యధిక మానవ మరణాలు జరుగుతాయని అంటున్నారు స్నేక్ క్యాచర్లు. భారతదేశంలో అత్యధిక పాము కాటు మరణలు కారణమైన నాలుగు విష సర్పాల్లో ఇదొకటి. ఇది దూకుడు స్వభావం గల పాము. చాలా చురుగ్గా కదులుతుంది. ఎదురు దాడి చేస్తుంది. ఈ పాము గరిష్టంగా 166 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది. రక్త పింజరి కాటు వేయగానే మనిషి శరీరంలో రక్తనాళాలు చిట్లి మరణాలు సంభవిస్తాయి. ఎంతటి ప్రమాదం అంటే ఇది ఒక్క కాటులో పంపే విషయం 16 మందిని చంపగలరని అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..