
టీడీపీకి చెందిన తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సొంత పార్టీ మహిళా నేత ఈ ఆరోపణలు చేశారు. ఆమెతో ప్రైవేటు హోటల్లో ఆయన ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆమె హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యేతో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలను మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యే తనను బెదిరించి బలవంతంగా లొంగదీసుకున్నట్లు ఆ మహిళ ఆరోపించారు. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరించారని.. తప్పనిసరి పరిస్థితుల్లో అతడికి లొంగక తప్పలేదని బాధిత మహిళ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండొద్దని బాధిత మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.
ఎమ్మెల్యే ఆదిమూలం ఎలాంటివాడో అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే రాసలీలలను పెన్ కెమెరాలో రికార్డు చేసినట్లు ఆ మహిళ వెల్లడించారు. తన దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయని.. ఎమ్మెల్యే తనకు 100 సార్లు కాల్ చేశాడంటూ లేఖతో పాటు స్క్రీన్ షాట్లు కూడా జత చేశారు. ఎమ్మెల్యే తనకు రాత్రిళ్లు మెసేజ్‌లు చేసి వేధించేవారని ఆవేదన.. తన భర్తకు ఈ విషయం తెలిసిందని.. ఆయన సహకారంతో ఎమ్మెల్యే పిలిచిన రోజు పెన్ కెమెరాలు పెట్టుకుని హోటల్‌కి వెళ్లి ఆయన రాసలీలన్నీ అందులో రికార్డు చేశానని చెప్పుకొచ్చారు. మహిళల జీవితాలతో ఆడుకునే ఇలాంటి వాళ్లని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబును బాధితురాలు డిమాండ్ చేశారు. ఆదిమూలంపై కఠినచర్యలు తీసుకుని తనకు, తన కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు. కోనేటి ఆదిమూలం.. 2024 ఎన్నికల్లో జగన్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా ఆయన ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. అయితే ఆ వీడియోతో తనకు సంబంధం లేదని ఆయన అంటున్నారు. ఆ వీడియో మార్ఫింగ్ చేసిందని చెప్పుకొచ్చారు.. మరి పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆదిమూలం స్పందించాల్సి ఉంది.

