గత కొంత కాలంగా కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులపై దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తీస్తున్నాయి. కుక్కల దాడులతో ఇప్పటికే పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఓ వ్యక్తిపై కుక్కపై విచక్షణ రహితంగా దాడి చేయడం కలకలం రేపుతోంది. ముంబైలో ఈ ఘటన జరిగింది. దీంతో జంతు ప్రేమికులు యువకుడిని చితకబాదారు. ముంబైలోని కోపర్‌ఖైరనే సెక్టర్ 19లో ఓ యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్ ఆవరణలో ఓ కుక్కపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. ఆగస్ట్ 3న ఈ సంఘటన చోటు చేసుకుంది.
సదరు యువకుడు లాఠీతో కుక్కను దారుణంగా కొడుతున్న వైనం సొసైటీ సీసీకెమెరాల్లో రికార్డయ్యింది. ఈ విషయాన్ని తెలుసుకున్న యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సభ్యులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహంతో యువకుడిపై దాడిచేసి, స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పట్ల స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు సైతం సమాజంలో భాగమేనని.. అలాంటి వాటిపై హింసాత్మకంగా ప్రవర్తించడం దారుణమని అంటున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.