
మరోవైపు విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లలో పాడైన విద్యుత్తు మీటర్లను మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నేటి నుంచి విద్యుత్‌శాఖ సిబ్బంది కొత్త మీటర్లను అమర్చనున్నారు. నగరంలోని 32 డివిజన్ల పరిధిలో ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. కొన్ని ఇళ్లలో కింద అంతస్తులు పూర్తిగా వరదతో మునిగిపోయాయి. ఈ ఇళ్లు తొమ్మిది రోజులు నీటిలోనే ఉన్నాయి. అలాగే కొన్ని షాపులు కూడా నీటమునిగిన పరిస్థితి ఉంది.. ఈ వరదతో మీటర్లు దెబ్బతిన్నాయి.
విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో గతవారమే విద్యుత్‌ను పునరుద్ధరించారు. కొన్ని మీటర్లు మొరాయించగా.. విద్యుత్‌శాఖ సిబ్బంది మరమ్మతులు చేశారు. కొన్ని ఇళ్లలో మీటర్లు పూర్తిగా నీటమునగడంతో పనిచేయడం లేదు.. అందుకే వాటి స్థానంలో కొత్తవాటిని తీసుకొస్తున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 1.59 లక్షల సర్వీసులు ఉన్నట్లు తెలుస్తోంది.. వీటిలో కూడా 25 వేల మీటర్ల వరకు సెల్లార్లలో ఉన్నాయి. ఈ మీటర్లన్నీ దెబ్బ తినడంతో.. అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే విద్యుత్‌శాఖ అధికారులు 35వేల మీటర్లను సిద్ధం చేశారు. అంతేకాదు కొత్త మీటర్లను ఉచితంగా బిగిస్తారు.. దీంతో వినియోగదారులపై భారం ఉండదంటున్నారు.
మరోవైపు విద్యుత్ ఉద్యోగులు విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచారు. ఈ మేరకు వారు ఒక్క రోజు జీతం రూ.10కోట్ల 60 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్ అందజేశారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ ఉద్యోగులు సహాయ చర్యలు అందించడంతో పాటు వారికి బాధితులకు ఆర్థిక సహాయమూ అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రశంసించారు.

