గువాహటి, సెప్టెంబర్ 11: అస్సాంలోని ఐఐటీ గువాహటిలో ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపస్‌లోని ‘బ్రహ్మపుత్ర’ వసతిగృహంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి బిమలేశ్ కుమార్ (21) ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బిమలేశ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. నెల రోజుల వ్యవధిలో క్యాంపస్‌లో ఇది రెండో మరణం కావడం విశేషం. మృతుడు బిమలేశ్ సోమవారం ఉదయం హాస్టల్ గదిలో శవమై కనిపించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్ధి మృతికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
గడచిన నెల రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధులు సూసైడ్ చేసుకోవడం క్యాంపస్‌లో కలకలం సృష్టిచింది. దీంతో ఐఐటీ గువహటి విద్యార్ధులంతా అడ్మినిస్ట్రేటివ్ భవనం వెలుపల నిరసనలకు దిగారు. విద్యాపరమైన ఒత్తిళ్ల కారణంగానే తమ తోటి విద్యార్థి మరణానికి దారితీస్తున్నాయని ఆరోపించారు. ఇన్‌స్టిట్యూట్‌లో జీవితాల కంటే గ్రేడులే ముఖ్యంగా మారాయంటూ క్యాంపస్‌లో పెద్దఎత్తున నిరసనకు దిగారు. సోమవారం ఉదయం బిమలేశ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఉండగా తాము చూశామని, అయినా తమను లోపలికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని వారు పేర్కొన్నారు. విద్యార్థి మృతి గురించి అతడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చేందుకు ప్రయత్నిస్తే ఫోన్లు కూడా లాక్కున్నట్లు ఆరోపించారు. తాము చూసిన 8 గంటల తర్వాత మృతదేహాన్ని బయటకు తీసుకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. డీన్లు, డైరెక్టర్లు తమను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా సరిగ్గా నెల రోజుల క్రితం ఆగస్టు 9న ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల ఇనిస్టిట్యూట్‌లో ఎంటెక్ విద్యార్థిని కూడా ఇదే రీతిలో తన హాస్టల్ గదిలో శవమై కనిపించిన సంగతి తెలిసిందే.
ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ గువాహటి విద్యాసంస్థలో ఈ ఏడాది ఇది మూడో ఆత్మహత్య కావడం గమనార్హం. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల మానసిక పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి విద్యార్ధుల సమస్యల నివృతికి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

