బాలినేని శ్రీనివాసరెడ్డి తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు.. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఒంగోలు నియోకవర్గం నుంచి 1999, 2004, 2009లో వరుసగా విజయం సాధించారు.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012లో మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఒంగోలులో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో బాలినేని ఓడిపోగా.. 2019లో మళ్లీ విజయం సాధించారు.. జగన్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. అయితే రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవి తొలగించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వయంగా జగన్ రంగంలోకి దిగి బుజ్జగించడంతో మెత్తబడ్డారు.
2024 ఎన్నికల సమయంలో బాలినేని పోటీ చేయడంపై కొంత సందిగ్థత ఏర్పడింది. ఆయన్ను ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ కోరగా.. నిరాకరించారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని.. లేకపోతే అసలు పోటీకి దూరంగా ఉంటానని చెప్పారు. అయితే చివరికి సీటు సాధించి ఒంగోలు నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా బాలినేని పార్టీ మారతారని ప్రచారం జరగ్గా.. తాను వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. అంతేకాదు ఎన్నికల ఫలితాలకు సంబంధించి.. ఈవీఎంల ఓట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోగా అనుమతి వచ్చింది. అయితే ఈలోపు ఆయన హైకోర్టును ఆశ్రయించారు.. వీవీ ప్యాట్ స్లిప్పుల్ని కూడా లెక్కించాలని కోరారు.. ఈ అంశంపై విచారణ కూడా జరుగుతోంది. ఈ సమయంలో బాలినేని రాజీనామా వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మరి బాలినేనిని వైఎస్సార్‌సీపీ ఎలా బుజ్జగిస్తుందో చూడాలి మరి.