కంటైనర్ కింద నలిగిన కారులో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉండగా.. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న వారిని కలచివేశాయి.
కంటైనర్ లారీ కింద నలిగిన కారులో చిక్కుకొని కాపాడమంటూ బాధితులు ఆర్తనాదాలు చేశారు. వారి కష్టం చూసి కొంత మంది వాహనదారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చేయి బయటకు పెట్టి తమ ఉనికి చాటుకున్న ఓ వ్యక్తికి.. ‘కంటైనర్‌ను పైకి లేపుతున్నాం, మిమ్మల్ని బయటకి తీస్తాం’ అంటూ ధైర్యం చెప్పారు.
ప్రమాదానికి కారణమైన లారీ గురువారం (సెప్టెంబర్ 12) ఉదయం కలకడ నుంచి టమాట లోడుతో చెన్నైకి బయల్దేరింది. మార్గమధ్యంలో చంద్రగిరి మండలం భాకరాపేటలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.