జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 13 నుండి 15వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు గురువారం సాయంత్రం పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహించారు. సెప్టెంబరు 13న చతుష్టార్చాన, అగ్ని ప్రతిష్ట, పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం 6 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 14న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 15న పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 14 నుండి 16వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు సెప్టెంబరు 13వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆచార్య రుత్విక్‌వరణంలో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్రసమర్పణ చేస్తారు. సాయంత్రం ఆలయ విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతివారిని ఊరేగింపు నిర్వహించి, ఆ తరువాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 14న ఉదయం పవిత్రప్రతిష్ట, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 15న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 16న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
తిరుమల నాద నీరాజనం వేదికపై శ్రీ శ్రీనివాస వేద విద్వత్ సదస్సు
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ఆక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు తిరుమలలోని నాద నీరాజనం వేదికపై ప్రముఖ పండితులతో శ్రీశ్రీనివాస వేద విద్వత్ సదస్సు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం ఉదయం 5 నుడి 6.30 గంటల వరకు చతుర్వేద పారాయణం, దేశంలోని ప్రముఖు పీఠాధిపతులు, మఠాధిపతులు, వేద పండితులతో వేద విజ్ఞనంపై సదస్సు నిర్వహించనున్నారు. ఇందులో వేదాలలోని ఆధునిక విజ్ఞానం, వేదాల్లోని సనాతన ధర్మం, వేదాల్లోని పురుషార్థలు, సమాజానికి అవసరమైన వేదభాష్యం, వేదాలలో భగవత్ తత్వం, వేదం – వేదాంగాలు, వేదం – ఉపనిషత్తుల సందేశం, తదితర అంశాలపై ఉపన్యాసించనున్నారు.