ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో కొత్త లిక్కర్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సరసమైన ధరకే నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలానే ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వాలంటీర్ వ్యవస్థపై సుధీర్ఘమైన చర్చ…
వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్ భేటీలో సుధీర్ఘ చర్చ జరిగింది. 2023 ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని.. 2023లో వాలంటీర్ల పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని మంత్రులు ముఖ్యమంత్రికి నివేదించారు. దీంతో వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
మంత్రిమండలి తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు…
- భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్ నిర్ణయం
- వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి సైతం ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
- చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది.