
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతమైన చాంద్రాయణగుట్టలో ఇటీవల గంజాయి మత్తులో ఉన్న యువకుల బృందం చేసిన హంగామా తీవ్ర కలకలం రేపింది. రోడ్లపై అర్థరాత్రి సమయంలో వీరంగా చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన ఈ గంజాయి బ్యాచ్ వ్యవహారం సమాజంలో మత్తుపదార్థాల దుర్వినియోగం ఎంత ప్రమాదకరంగా మారుతోందో స్పష్టంగా చూపిస్తుంది. యువకులు మత్తులో రోడ్లపై ఆడిపాడడం, వాహనదారులను నిలిపివేయడం, పలుచోట్ల చిన్నపాటి గొడవలు చేయడం వంటి చర్యలతో చాంద్రాయణగుట్ట ప్రాంత ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి బ్యాచ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ వారు పోలీసులకే ఎదురుతిరిగే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు అందిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్‌కు తరలించారు.
ఇక ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులో ఉన్న యువకుల వద్ద నుంచి గంజాయి నిల్వలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఈ గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్‌ను గుర్తించేందుకు విచారణ ప్రారంభించారు. ఎక్కడి నుంచి గంజాయి వస్తోంది, ఎవరెవరు దీనికి పాలుపంచుకుంటున్నారు, గంజాయి సరఫరాకు పాతబస్తీ కేంద్రంగా మారిందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.
ఇలాంటి సంఘటనలు మన సమాజానికి పెద్ద ముప్పుగా మారుతున్న మత్తుపదార్థాల వ్యసనం తీవ్రతను తెలియజేస్తున్నాయి. యువత చెడు మార్గాల్లో అడుగేస్తున్న తీరు ఆందోళనకరం. గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకాన్ని నిరోధించేందుకు కేవలం పోలీసుల చర్యలు సరిపోవు. దీనిపై సమాజం మొత్తం అప్రమత్తం కావాలి. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ, తప్పుదారిలోకి వెళ్లకుండా కాపాడాల్సిన అవసరం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
