బంగారాన్ని చూసి మురిసిపోవడానికే వేలు, లక్షలు ఖర్చుపెట్టే రోజులివి. అంత డిమాండ్ ఉన్న గోల్డ్.. ఇప్పుడు ఆభరణాలకే కాదు.. తినటానికి కూడా పనికొస్తుంది అంటున్నారు స్వీట్ షాప్ ఓనర్లు. దీపావళి పండగ వేళ జైపూర్‌లోని ఒక స్వీట్ షాప్ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన స్వీట్‌ను తయారు చేసింది. ఆ స్వీట్ పేరు స్వర్ణ ప్రసాదం. పేరులోనే స్వర్ణం అని పెట్టుకున్న ఆ స్వీట్‌ను బంగారంతోనే తయారు చేశారు. అది కూడా 24 క్యారెట్ల మేలిమి బంగారం. ఈ ప్రత్యేకమైన మిఠాయి కిలో ధర అక్షరాలా ఒక లక్ష 11 వేల రూపాయలు. అయినా గోల్డును ఎలా తింటారనే కదా ప్రశ్న. ఈ స్వీట్లలో తినదగిన 24 క్యారెట్ల బంగారాన్ని కలిపి తయారు చేస్తారట. దీన్ని స్వర్ణ భస్మం లేదా గోల్డ్ యాషెస్ అంటున్నారు.
ఈ స్వీట్‌లో ఉపయోగించిన బంగారం, ఇతర అత్యంత నాణ్యమైన పదార్థాల వల్ల దీని ధర లక్ష రూపాయలు దాటినట్లు షాప్ యజమాని తెలిపారు. అఫ్గానిస్థాన్‌లో ఉత్పత్తి అయ్యే చిల్గోజా గింజలతో దీనిని రూపొందించారు. మిఠాయిపై 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూత పూశారు. అనంతరం కుంకుమపువ్వు, పైన్ నట్స్‌తో అలంకరించారు. ఈ మిఠాయి భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని తయారీదారులు చెప్పారు. మొత్తంగా పండగ మార్కెట్‌లో తమ ప్రత్యేకతను చాటుకోవడానికి తయారీదారులు ఎంచుకుంటున్న ఈ స్వీట్ రాజసాన్ని అందుకుంది.
Also Read: ఘట్‌కేసర్‌లో అనుమానాస్పదంగా 17 ఏళ్ల బాలుడు.. ఆపి తనిఖీ చేయగా..

