Srikakulam Venkateswara Swamy Temple Harimukunda Panda: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయం తొక్కిసలాట ఘటనలో 10మంది చనిపోయారు. దీంతో ఆ ఆలయం గురించి చర్చ జరుగుతోంది. ఈ ఆలయాన్ని హరిముకుంద పండా సొంత నిధులతో నిర్మించారు. ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళితే ఎదురైన అనుభవంతో తన సొంత డబ్బులతో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే రూ.10 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
హైలైట్:
- వార్తల్లో నిలిచిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో
- హరి ముకుంద పండా ఈ ఆలయాన్ని నిర్మించారు
- తిరుమలలో దర్శనం దక్కలేదనే ఇక్కడ ఆలయం

హరిముకుంద పండా పదేళ్ల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారట. గోవింద నామాన్ని జపిస్తూ గంటల తరబడి స్వామి దర్శనం కోసం క్యూ లైన్‌లో నిలబడి ఎదురు చూశారట. ఆనంద నిలయంలో కొలువైన ఆ దేవదేవుడిని కాసేపు అక్కడే నిలబడి కనులారా చూడొచ్చని ఆయన ఎంతో ఆశపడ్డారట. అయితే ఆ భాగ్యం దక్కనే లేదట.. అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకు నెట్టేశారట. తాను ఎనిమిది పదుల వృద్ధుడినని, అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినా వినిపించుకోలేదట. చివరకు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారట. తల్లితో తన అనుభవం పంచుకున్న సమయంలో ఒక ఆలయం నిర్మాణం ఆలోచన వచ్చిందట.
వెంటనే శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో కాశీబుగ్గ పెట్రోలు బంకు వెనుక ఉన్న పండా తోటల్లో సువిశాలమైన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాడు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఆనంద నిలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీర్చిదిద్దాడు. ఈ ఆలయంలో శ్రీవారితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవారి విగ్రహాలను ఏకశిలతో రూపొందించారు. నవగ్రహ దేవతలతో పాటు సకల దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. లయం బయట ఆంజనేయుడు, గరుత్మంతుడి భారీ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తిరుమల ఆలయం తరహాలో నిర్మాణాలు చేశారు.
ఈ ఆలయానికి దాతలు ఎవరూ లేరు.. హరిముకుంద పండానే తమ సొంత డబ్బులతో ఆలయాన్ని కట్టించారు. పూర్తిసేవా విధానంలో ఆలయం నిర్మించాడు. పేద కుటుంబాల వివాహాల కోసం ప్రత్యేక కల్యాణమండపం కూడా నిర్మించాడట. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు స్నానాలు చేయడానికి వీలుగా కోనేరు తవ్వించారట. అభిషేకాలు, ప్రత్యేక పూజల కోసం యాగస్థలి, భక్తులు వేచి ఉండేందుకు విశ్రాంతి మండపాలు నిర్మించారట. అయితే ఈ ఆలయంలో ఇంతటి విషాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.


