ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు సంభంధించి కీలక అప్డేట్ వచ్చింది. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అయ్యే వారికి పరిహారం అందించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1000 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. శనివారం నాడు ఈ నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్ట్ కన్నా ముందే.. నిర్వాసితులకు కాలనీలు నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఆ వివరాలు..
హైలైట్:
- పోలవరం నిర్వాసితులకు రూ.1000 కోట్లు
- పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వం
- 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి

గత వైసీపీ హయాంలో పోలవరం నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, కేంద్రం ఇచ్చిన రూ.3,385 కోట్లను జగన్ దారి మళ్లించారని మంత్రి నిమ్మల ఆరోపించారు. శనివారం ఏలూరు జిల్లా వేలేరుపాడులో పోలవరం నిర్వాసితులకు భూసేకరణ, పునరావాసం పరిహారం కింద రూ.1000 కోట్ల పంపిణీని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి నిమ్మల తెలిపారు. అందులో భాగంగానే నిర్వాసితుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామన్నారు. మరో 20 రోజుల్లో నిర్వాసితులందరికీ పరిహారం అందుతుందని ఆయన తెలిపారు. ఎవరికైనా పరిహారం అందకపోతే టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామన్నారు. పరిహారం జమకాకపోవడానికి గల కారణాలను నిర్వాసితులకు తెలియజేయాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. గతంలో 2016లో పోలవరం నిర్వాసితులకు రూ.700 కోట్లు, 2025 జనవరిలో రూ.900 కోట్లు, ప్రస్తుతం రూ.1000 కోట్లతో కలిపి మొత్తం రూ.2600 కోట్లు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి నిమ్మల తెలిపారు.
పరిహారం ఇప్పిస్తామని చెప్పే దళారులను గుర్తించి, వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని మంత్రి నిమ్మల.. ఎస్పీని ఆదేశించారు. అనంతరం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్రపటాలకు నిర్వాసితుల సమక్షంలో పాలాభిషేకం చేశారు. సభ ముగిసే సమయానికి నిర్వాసితుల ఖాతాల్లో రూ.40 కోట్లు జమ అయినట్లు అధికారులు తెలిపారు.


