నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారైందని ఏ1 నిందితుడు చెప్పడంతో సిట్ రంగంలోకి దిగింది. దీంతో జోగి రమేష్ ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించనున్నారు. ఈ కేసులో జోగి రమేష్‌తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
హైలైట్:
- నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం
- మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
- అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు

అయితే ఆయన అరెస్ట్‌కు ముందు జోగి రమేశ్ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు జోగి రమేష్ ఇంటికి రావడంతో.. పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు తరలి వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు వచ్చారని తెలుసుకున్న జోగి రమేష్.. సుమారు 3 గంటల పాటు డోర్ తీయక పోవడంతో ఇంటి బయటనే ఉన్నారు. అనంతరం ఉదయం 8 గంటల సమయంలో ఆయన డోర్ ఒపెన్ చేయడంతో.. ముందుగా పోలీసులు ఆయనకు నోటీసులు అందజేసి ఆ తర్వాత అరెస్ట్ చేశారు.


