Andhra Pradesh Rains: ఏపీవాసులకు అలర్ట్.. రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు వర్ష సూచన నేపథ్యంలో చలి తీవ్రత తగ్గొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలోని శ్రీలంక సమీపంలో మంగళవారం రోజున అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారుతుందంటున్న వాతావరణ శాఖ అధికారులు.. ఆ తర్వాత తమిళనాడు తీరం వైపు కదులుతుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంపై దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని చెప్తున్నారు. అయితే అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేశారు.
మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉండనుంది. అయితే కొన్నిచోట్ల దట్టంగా పొగమంచు కురుస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. చాలాచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. చలి తీవ్రత కూడా తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి వేళలతో పాటుగా పగటి పూట కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి పెరిగి చిన్నారులు, వృద్ధులు , బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రకటన వారికి కాస్త ఉపశమనం కల్గించనుంది.
మరోవైపు ఈ వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయని.. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని అక్కడి అధికారులు సూచించారు. అలాగే చెన్నైకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.


