TTD Launches Midday Meals For Tirupati Womens College: తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజీ వార్షికోత్సవంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విద్యార్థినులకు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుచేసుకుని చదువుకోవాలని సూచించారు. డే స్కాలర్స్‌కు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి, బంగారు భవిష్యత్తుకు ఇంటర్మీడియట్ విద్య పునాది అని తెలిపారు. క్రీడల్లో రాణించిన విద్యార్థినులను అభినందించారు. శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి.
హైలైట్:
- తిరుపతి పద్మావతి మహిళా జూనియర్ కాలేజీ
- టీటీడీ మధ్యాహ్న భోజనం ప్రారంభించారు
- డే స్కాలర్స్‌కు ఉచితంగా భోజనం అందిస్తారు

అనంతరం క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థినులను టీటీడీ ఛైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం డేస్కాలర్స్ విద్యార్థినిలకు ఏర్పాటు చేసిన మధ్యాహ్నభోజన పథకాన్ని ప్రారంభించి వారితోపాటు కలిసి భోజనం చేశారు. శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాలలో డే స్కాలర్స్ కు కల్పించిన సదుపాయం ద్వారా 436 మంది విద్యార్థినులకు లబ్ది చేకూరుతుంది. అంతకుముందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి భువనేశ్వరి కళాశాల సమగ్ర నివేదికను నివేదించారు. గతేడాది పరీక్షల ఫలితాలలో సమిష్టి కృషితో 97 శాతం ఫలితాలు వచ్చాయన్నారు. కళాశాల వార్షికోత్సవ ప్రారంభంలో విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
శ్రీ త్యాగరాజస్వామి వారి 179వ ఆరాధన ఉత్సవం
టీటీడీ శ్రీ వేంకటేశ్వర సంగీక నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి 179వ ఆరాధన ఉత్సవం జరుగుతోంది. శ్రీ ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆవరణంలోని ఓపెన్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం 7.30 గం.ల నుండి జనవరి 08వ తేదీ ఉదయం 8 గం.ల వరకు 24 గంటల పాటు అఖండ సంగీత నీరాజనం కార్యక్రమం జరుగనుంది.
ఈ సందర్భంగా ఉదయం 7.30 గం.లకు నాదస్వర డోలు కచేరీ అనంతరం శ్రీ త్యాగరాజస్వామి వారికి పంచామృత అభిషేక కార్యక్రమం, ఘనరాగ పంచరత్న కీర్తనల బృందగానం నగరంలోని సంగీత విద్వాంసులు కళాశాల అధ్యాపక బృందం సంయుక్తంగా నిర్వహించారు. అనంతరం సంగీత విద్వాంసులు, సంగీత నృత్య కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, కళాశాల మరియు నాదస్వర డోలు పాఠశాలలోని అధ్యాపక ఉపాధ్యాయ బృందం వారికి కేటాయించిన సమయానికి గాత్ర , వాద్య సంగీత కచేరీలు ఆధ్యంతం భక్తి శ్రద్ధలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉదయం 8.50 గం.ల నుండి 10.30 గం.ల వరకు శ్రీ త్యాగరాజ విరచిత ఘనరాగ పంచరత్న కృతులు బృందగానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
24 గంటల అఖండ సంగీత నీరాజనం కార్యక్రమం గురువారం ఉదయం 7:30 గంటలకు వరకు నిర్వహించి, అనంతరం శ్రీ ఆంజనేయ ఉత్సవం మరియు మహా మంగళహారతి కార్యక్రమంతో పరిసమాప్తి అవుతుందని ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ఉమా ముద్దుబాల తెలిపారు.


