అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు పది ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు. మరో పది ఎకరాల్లో పార్కింగ్ స్థలం సిద్ధం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, 500 మంది ప్రముఖులు సహా వేలాది మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైలైట్:
- అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు
- ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారుల
- పది వేల మందికి పైగా ప్రజలు వస్తారని అంచనా

అమరావతిలో ఈసారి జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్, మంత్రులు సహా దాదాపు 500 మంది ప్రముఖులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరే కాకుండా రాజదానిలో తొలిసారి గణతంత్ర వేడుకల్ని అమరావతిలో నిర్వహిస్తున్నందున.. వాటిని వీక్షించేందుకు రాజధాని గ్రామాల నుంచి, గుంటూరు, విజయవాడ నుంచి దాదాపు 10 వేల మంది వరకు తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. దీంతో ముఖులు, ప్రజలకు వేర్వేరుగా బ్లాక్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతేకాకుండా వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా పలు శకటాలు కూడా ప్రదర్శించనున్నారు. ఇందులో ఆకట్టుకున్న మూడు శకటాలకు బహుమతులు అందజేస్తారు
అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లపై ఏపీ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వివిధ శాఖల అధికారులతో జనవరి 7న రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వేడుకలు జరిగే పరేడ్ గ్రౌండ్‌లో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం వంతి తదితర ప్రభుత్వ భవనాలు విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. కాగా, రాజధానిలో తొలి గణతంత్ర వేడుకల కోసం వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లను.. అధికారులు ప్రధాన కార్యదర్శికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.


