నెల్లూరు జిల్లా వెంకటాచలంకు చెందిన శివప్రసాద్.. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన చెల్లెలు సుబ్బలక్ష్మి జ్ఞాపకార్థం గుడి కట్టాడు. ఆర్థిక స్తోమత లేకపోయినా.. తన ఇంట్లోనే కొంత భాగాన్ని గుడిగా మార్చాడు. అనంతరం ఒంగోలులో తన చెల్లెలి విగ్రహాన్ని తయారు చేయించి గుడిలో ప్రతిష్టించాడు. అప్పటినుంచి దాదాపు 14 ఏళ్లుగా శివప్రసాద్ కుటుంబం సుబ్బలక్ష్మికి నిత్యం పూజలు చేస్తున్నారు. ఈ అరుదైన సంఘటన మానవ సంబంధాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
హైలైట్:
- చెల్లి కోసం గుడి కట్టిన అన్న
- సోదరిపై ప్రేమ చాటుకుంటున్న నెల్లూరు జిల్లా వాసి
- 14 ఏళ్లుగా చెల్లికి పూజలు చేస్తున్న అన్న

డ్యూటీలో భాగంగా చిల్లకూరు వరకు ప్రయాణిస్తుండేది సుబ్బలక్ష్మి. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి వస్తుండగా.. 2011 సెప్టెంబర్ 20న నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బలక్ష్మి చనిపోయింది. అల్లారుముద్దుగా చూసుకున్న చెల్లి సుబ్బలక్ష్మి చనిపోవడంతో.. శివప్రసాద్ కన్నీరుమున్నీరు అయ్యాడు. తన చెల్లి మరణాన్ని జీర్జించుకోలేకపోయాడు. భౌతికంగా దూరమైనా.. తన చెల్లి జ్ఞాపకాలతో బతుకుతున్న శివప్రసాద్.. ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆలయం నిర్మించడానికి ఆర్థిక స్తోమత లేకున్నా వెనక్కి తగ్గలేదు శివ ప్రసాద్. ఎవరి సాయం తీసుకోకుండా గుడి కట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో మొదటగా తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో గుడి పనులు ప్రారంభించాడు శివప్రసాద్. అయితే అది ప్రభుత్వ స్థలం కావడంతో అధికారులు అతడిని అడ్డుకున్నారు. అయినా వెనకడుగు వేయకుండా.. తన ఇంట్లోనే కొంత భాగాన్ని గుడిగా మార్చాడు. అనంతరం గుంటూరు జిల్లా తెనాలిలో.. తన చెల్లెలి విగ్రహం చేయించి గుడిలో ప్రతిష్టించాడు. అప్పటినుంచి అతడి కుటుంబం.. సుబ్బలక్ష్మి విగ్రహానికి పూజలు చేస్తూ ఆరాధిస్తున్నారు.
కలకాలం ఈ బంధం కొనసాగాలని ..
మొత్తం ఐదుగురు తోబుట్టువుల్లో సుబ్బలక్ష్మి నాలుగో సంతానం. అయితే సుబ్బలక్ష్మి భౌతికంగా దూరమైనా.. ఆమె ప్రేమ తమతోనే ఉందని శివప్రసాద్ గతంలో చెప్పాడు. తన చెల్లిని మర్చిపోకుండా ఇలా గుడికట్టామని తెలిపాడు. దీంతో తన చెల్లి తమతోనే ఉంటుందన్నాడు. తాము చనిపోయినా, ఇంకో తరం వచ్చినా.. తమ బంధం ఇలాగే కొనసాగుతుందని చెప్పాడు.


