కృష్ణా జిల్లా గంగూరు యూనియన్ బ్యాంకులో మాజీ మేనేజర్ ప్రభావతి చేతివాటం చూపించింది. చనిపోయిన నాగేంద్ర బాబు అనే వ్యక్తి బంగారాన్ని.. తన పేరును నామినీగా చేర్చి కాజేసింది. బంగారం విడిపించడానికి వచ్చిన అతడి కుటుంబ సబ్యులు నామినీగా ప్రభావతి పేరు ఉండటం చూసి షాక్ అయ్యారు. అనంతరం బ్యాంకు సిబ్బందిని నిలదీశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రభావతి గతంలోనూ చీటింగ్ కేసులో నిందితురాలిగా ఉంది.
హైలైట్:
- పని చేసిన బ్యాంకులోనే చేతివాటం
- చనిపోయిన వ్యక్తి బంగారం కాజేసిన మాజీ మేనేజర్!
- గతంలో ప్రభావతిపై చీటింగ్ కేసు నమోదు

ఇదీ జరిగింది..
బాపులపాడు మండలానికి చెందిన నాగేంద్ర బాబు గతంలో గంగూరు యూనియన్ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టాడు. అయితే ఆయన చనిపోయాడు. దీంతో ఆ బంగారాన్ని విడిపించడానికి బ్యాంకుకు వెళ్లారు ఆయన కుటుంబ సభ్యులు. అయితే అక్కడ నామినీగా ఆ బ్యాంకులో పని చేసిన మాజీ మేనేజర్ ప్రభావతి పేరు ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. చనిపోయిన వ్యక్తి బంగారాన్ని మాజీ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి కాజేసేందని తెలిసి అవాక్కయ్యారు. కాగా, చనిపోయిన వ్యక్తితో ఎలాంటి సంబంధం లేని ప్రభావతికి.. నాగేంద్ర బాబు డెత్ సర్టిఫికెట్ ఎలా జారీ అయిందని అతడి కుటుంబ సభ్యులు బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించారు. ప్రభావతి ఆ సర్టిఫికెట్‌తో బంగారం విడిపించుకునేందుకు వస్తే.. బ్యాంకు అధికారులు ఎలా ఇచ్చారని బాధితులు నిలదీశారు. అయితే గతంలో కూడా పలు కేసుల్లోయూనియన్ బ్యాంకు మాజీ మేనేజర్ ప్రభావతి నిందితురాలిగా ఉన్నారని బాధితులు చెప్పారు. పలు మార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
గతంలో చీటింగ్ కేసు..
గతంలో ప్రభావతిపై చీటింగ్ కేసు నమోదైంది. మర్రిబంధం గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావు.. తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ప్రభావతిని నమ్మి ఆమె పని చేస్తున్న బ్యాంకులో బంగారం పెట్టాడు. లాకర్ అడిగితే గోల్డ్ లోన్ తీసుకోమని ప్రభావిత చెప్పడంతో.. రుణం తీసుకుని రెండు నెలల్లోనే తిరిగి చెల్లించాడు. ఆ తర్వాత తన బంగారం తనకి తిరిగి ఇవ్వమని అడిగితే.. ఇంట్లో ఉందని చెప్పి యోగేశ్వరరావును అక్కడికి తీసుకెళ్లింది ప్రభావతి. అక్కడ పెళ్లి ప్రపోజల్ పెట్టింది చెప్పాడు బాధితుడు. అంతేకాదు తన బంగారంతో వడ్డాణం చేయించుకుంటున్నాను అని చెప్పిందని.. ఆ ప్రపోజల్ తిరస్కరించి తన బంగారం కావాలి అని అడిగితే బెదిరిస్తోందని పెనమలూరు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. దీంతో మేనేజర్ ప్రభావతిపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.


