తిరుమలలో ఖాళీ మద్యం సీసాల వ్యవహారంలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త కోటితో పాటుగా, ఓ మీడియా ఛానెల్ ప్రతినిధిని అరెస్ట్ చేశారు. టీటీడీకి, పోలీసులకు చెడ్డపేరు తీసుకురావాలనే కుట్రలో భాగంగానే వీరు ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు తిరుమలలో మద్యం బాటిళ్ల కేసులో జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. దీని వెనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉందని.. కోటి భూమన అనుచరుడని కిరణ్ రాయల్ ఆరోపించారు.

మరోవైపు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ గోపురం మీదకు ఎక్కిన వ్యక్తి కూడా వైసీపీ కార్యకర్తేననే అనుమానం ఉందని కిరణ్ రాయల్ సందేహం వ్యక్తం చేశారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం బాటిళ్ళ వ్యవహారంలో కూడా వైసీపీ పాత్ర ఉందని.. తిరుమల, తిరుపతిలో ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కిరణ్ రాయల్ కోరారు.
తిరుమలలో ఖాళీ మద్యం సీసాల వెనుక..
మరోవైపు తిరుమలలోని పోలీస్ అతిథి గృహం సమీపంలో ఖాళీ మద్యం బాటిళ్లు అంటూ గత ఆదివారం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో తిరుమల బాలాజీ కాలనీ ప్రాంతంలో చెట్లలో.. 9 ఖాళీ మద్యం సీసాలు గుర్తించారు. దర్యాప్తులో వీటికి పోలీస్ అతిథి గృహానికి సంబంధం లేదని గుర్తించారు. అనంతరం ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తిరుమలలో పదుల సంఖ్యలో ఖాళీ మద్యం బాటిళ్లు
ఈ ఘటన వెనుక తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి అనే వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోటి మరికొంతమందితో కలిసి టీటీడీ, పోలీస్ విభాగాలను లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారం ఖాళీ మద్యం సీసాలను తిరుపతి నుంచి తిరుమలకు తీసుకువచ్చి.. బాలాజీ కాలనీ ప్రాంతంలోని కౌస్తుభం అతిథి గృహం కాంపౌండ్ వాల్ బయట చెట్ల పొదల వద్ద పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఆ తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం మీడియా ప్రతినిధుల సహకారంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో ఆళ్లపాక కోటి, మోహన్ కృష్ణ అనే ఇద్దరిని తిరుమల పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి మొబైల్ ఫోన్లు, స్విఫ్ట్ డిజైర్ కారు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


