
దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో.. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ భక్తులను అమ్మవారి దర్శనాలకు అనుమతిస్తారు. తొలిరోజు మాత్రం ఉదయం 9 గంటల తర్వాత నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఈసారి దసరా వేడుకలు జరిగే తొమ్మిది రోజులతో పాటుగా ఈనెల 13, 14 వరకూ అంతరాలయం దర్శనాలు పూర్తిగా ఆపేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ముఖమండప దర్శనాలకు మాత్రమే అనుమతిస్తారన్నారు.
దుర్గమ్మకు నైవేద్యాలు సమర్పించే సమయాల్లో భక్తుల్ని దర్శనానికి అనుమతించరు. అమ్మవారికి సమర్పించే ప్రతి నైవేద్యానికి 10-15 నిమిషాల సమయం పడుతుంది. మొత్తం మీద అరగంట వరకు దర్శనం నిలిపివేశారు.. ఇక ప్రతి రోజూ సాయంత్రం అమ్మవారికి సమర్పించే మహానివేదన సమయంలో గంటపాటు దర్శనానికి బ్రేక్ ఇస్తారు. ప్రతి రోజూ ఆలయం తెరిచిన తర్వాత వేకువజామున 3 గంటలకు అమ్మవారిని మేల్కొలుపుతారు. స్నపన కార్యక్రమాలు నిర్వహించి అభిషేకం చేస్తారు.. నివేదనగా అమ్మవారికి పాలను సమర్పిస్తారు. అనంతరం అమ్మవారిని అలంకరిస్తారు.. ఈ కార్యక్రమాలు 6 గంటల వరకు సాగుతాయి. ఉదయం 7 గంటల వరకు అర్చన.. అమ్మవారికి పులిహోర, లడ్డూ, చక్రపొంగలి, బెల్లపు పొంగలి, శెనగలు నివేదనగా ఇస్తారు. దుర్గమ్మకు నైవేద్యం సమర్పించే సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించరు. మళ్లీ ఉదయం 9 గంటలకు.. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య.. సాయంత్రం 4 గంటలకు.. సాయంత్రం 6-7 గంటల మధ్య అమ్మవారికి మహానివేదన ఇస్తారు.మహానివేదన అనంతరం పంచహారతులు కూడా ఇస్తారు.

