
తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్వి సభ్య ధర్మాసనం.. విచారణను రేపటికి వాయిదా వేసింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ విచారను కొనసాగించాలా లేక స్వతంత్య్ర దర్యాప్తు సంస్థకు విచారణను అప్పగించాలా అని ఇప్పటికే కోర్టు ప్రశ్నించింది. అయితే ఈ దర్యాప్తుపై అభిప్రాయం తెలిపేందుకు మరికొంత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరగా.. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ స్పష్టం చేసింది.
తిరుపతి లడ్డూ వ్యవహారంపై విచారణ సందర్భంగా.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా సీఎం ప్రకటన చేయడంపై సీరియస్ అయింది. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ఎలా ప్రకటన చేస్తారంటూ నిలదీసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు.. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని పేర్కొంది. విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించగా.. పిటిషనర్ తరఫున రాజశేఖర్ రావు వాదించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై కోర్టు ప్రశ్నలు వేసింది. కల్తీ జరిగిందని పేర్కొన్న నెయ్యి ఎక్కడి నుంచి సేకరించారని.. లడ్డూ తయారీకి ఆ నెయ్యిని ఉపయోగించారని ఆధారాలు ఏంటని ప్రశ్నించింది. అంతేకాకుండా నెయ్యిని పరీక్షలకు ఎప్పుడు పంపారు.. లడ్డూలను తిని చూశారా.. లడ్డూలో కల్తీ జరిగిందని తేలిందా.. అంటూ వరుస ప్రశ్నలు వేసింది.

