
మరోవైపు గుంటూరులోని కోల్డ్ స్టోరేజ్‌లో మిర్చి అంశంపైనా పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల రైతులు కోల్డ్ స్టోరేజ్‌లో మిర్చి దాచుకుంటే వారికి తెలియకుండానే రుణాలు తీసుకుని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలా మోసపోయిన రైతులందరూ కన్నీరు పెట్టుకుని రావడం బాధగా ఉందని.. నిందితులను అరెస్టు చేశామని, వారి ఆస్తులు అటాచ్ చేసేందుకు ఆదేశించామన్నారు. అంతేకాదు నకిలీ రైతులపైనా చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనుల్ని ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్‌తో కలిసి పరిశీలించారు. అక్కడ పనుల్లో నాణ్యత, ప్రమాణాలు పాటించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్‌యూబీలో నీళ్లు వస్తున్నాయని.. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి అధికారులను ప్రశ్నించారు. అంతేకాదు రైల్వే స్టేషన్ పశ్చిమంవైపు కొత్తగా నిర్మించిన ప్లాట్‌ఫాంపై టైల్స్ లేచిపోవడంపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. వర్షాల వల్ల ఆర్‌యూబీలోకి నీళ్లు వస్తున్నాయి.. ఇంకా పనులు జరుగుతుండటంతో ట్రాక్టర్లు రావడంతో టైల్స్ పాడైపోయాయని అధికారులు కేంద్రమంత్రి చెప్పారు. అయితే ఆయన అధికారుల సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వర్షాకాలంలో మన ఇంట్లోకి నీళ్లు వస్తుంటే ఇలాగే చూస్తే వదిలేస్తామా అని ప్రశ్నించారు. అసలు అక్కడ పనులు పూర్తి కాకముందే టైల్స్ ఎందుకు వేయాల్సి వచ్చిందని అడిగారు.
రైల్వే స్టేషన్‌లో పనుల కోసం కేంద్రం నుంచి రూ.కోట్లు నిధులు మంజూరవుతున్నా పనుల్లో నాణ్యత కనిపించడంలేదన్నారు కేంద్రమంత్రి. దీనికి బాధ్యులను గుర్తించాల్సిందేనని.. ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తున్న నిధులతో చేపట్టే పనులు సక్రమంగా లేకపోతే ఇంజినీర్ల పర్యవేక్షణ ఎందుకు లేదని ప్రశ్నించారు. ఉండడంలేదన్నారు. ఇక నుంచి ప్రతి నెలా రైల్వే పనుల పురోగతి, నాణ్యతపై సమీక్ష చేస్తానని వారితో చెప్పారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల అవసరాలను గుర్తించి అవసరమైన పనులు చేపట్టేందుకు నివేదికలు తయారుచేయాలని అధికారులకు సూచించారు పెమ్మసాని. కేంద్రం నుంచి ఇందుకు అవసరమయ్యే నిధులను రాబట్టేవిధంగా తాను కృషి చేస్తానన్నారు. అంతేకాదు గుంటూరులో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు అవసరమైన చోట్ల ఆర్‌యూబీలను నిర్మించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

