ఏపీలో క్యాప్ జెమినీ సంస్థ రానుంది. ఇవాళ మంత్రి నారా లోకేష్‌తో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. క్యాప్ జెమినీకి భూ కేటాయింపులు, తాత్కాలిక క్యాంపస్‌కు సంబంధించి ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటికే ఆ సంస్థ ఏర్పాటు కోసం విశాఖలో 20 ఎకరాల భూమిని పరిశీలించారు. అయితే తాత్కాలికంగా సేవలు అందించేందుకు మాత్రం ఒక ప్రైవేటు బిల్డింగ్‌ను ఎంపిక చేశారు. దీంతో త్వరలోనే ఏపీలో క్యాప్ జెమినీ సేవలు ప్రారంభం కానున్నాయి.

క్యాప్ జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఎజత్‌తో మంత్రి లోకేష్ భేటీ అయి కీలక విషయాలపై చర్చించారు. విశాఖలో క్యాప్ జెమినీ సంస్థ ఏర్పాటుపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. విశాఖలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న మధురవాడలోని ఐటీ పార్క్ హిల్-1పై క్యాప్ జెమినీ సంస్థ కోసం ఇప్పటికే 20 ఎకరాల భూమిని పరిశీలించారు.
అదే సమయంలో ఆ సంస్థ ప్రతినిధులు అడివివరం, ఆనందపురం పరిధిలో రెండు చోట్ల కూడా భూముల పరిశీలన చేశారు. అయితే క్యాప్ జెమినీకి పర్మినెంట్ క్యాంపస్ అందుబాటులోకి వచ్చే వరకు.. తాత్కాలికంగా కార్యకలాపాలు సాగించేందుకు సెంట్రల్ పార్కు సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ భవనాన్ని సెలెక్ట్ చేశారు.
అయితే క్యాప్ జెమినీ సంస్థ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు కోసం 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి కావాలని ఆ సంస్థ ప్రతినిధులు చూస్తున్నారు. ఇక తమ సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించాలని ఇప్పటికే.. క్యాప్ జెమినీ సంస్థ చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. కొత్తగా 4 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా క్యాప్ జెమినీ కంపెనీ.. ఏపీలో శాశ్వత క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్యాప్ జెమినీ లాంటి సంస్థ విశాఖకు రానుండటంతో ఏపీకి మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని అక్కడి యువత ఆశిస్తోంది.


