అయితే అధికారుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని నరేష్ వీడియోలో చెప్పారు. అలాగే తాను జోషి, పిల్లలను చూసి ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిపారు. తనకు రావాల్సిన డబ్బు వస్తే మొత్తం సర్దుబాటు చేసి తప్పుకోవాలనుకున్నాను అన్నారు. కానీ తనను మోసం చేశారన్నారు. అందరూ డబ్బు తీసుకున్నారు కానీ ఇప్పుడు తనను మాత్రమే తప్పు పడుతున్నారని.. ఇక తనకు బతకాలని లేదని చనిపోదామనుకుంటున్నట్టు వీడియోలో చెప్పుకొచ్చారు.
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ విచారణ చేపట్టింది.. ప్రధానంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో మోసాలపై చిలకలూరిపేట బ్యాంకు సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు. బ్యాంక్‌లో ఎఫ్‌డీలు దారి మళ్లించడంపై ఆరా తీశారు. రెండు నెలలుగా బాధితుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమ కాకపోవడంతో ఇటీవల బ్యాంకుకు వెళ్లి ప్రశ్నించారు. ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్ల బాండ్లు చెల్లవని.. అందులో డబ్బులు, బంగారం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించగా.. కేసును సీఐడీకి అప్పగించారు. అంతేకాదు మోసపోయిన ఖాతాదారులకు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అండగా నిలిచారు. బాధితులకు న్యాయం చేయాలని బ్యాంకు అధికారులను ఆయన కోరారు. రాష్ట్రంలో ఐసీఐసీఐ బ్యాంక్లుల్లో అవతవకల వ్యవహారం సంచలనంగా మారింది.