కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు వీగిపోయింది. దీనిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. వీగిపోయింది డీలిమిటేషన్ బిల్లే కానీ.. మహిళా బిల్లు కాదని.. మహిళా బిల్లుకు 2023లోనే ఆమోదం తెలిపినట్లు షర్మిల తెలిపారు. మహిళా రిజర్వేషన్ పేరుతో బీజేపీ చేసిన కుతంత్రాలు ఫలించలేదని.. ఇది దేశ ప్రజల విజయంగా వైఎస్ షర్మిల అభివర్ణించారు.

మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ చేసిన మాయోపాయం పారలేదంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. అక్రమ చట్టాలకు అవనిని అడ్డుపెట్టి ఆమోదించాలనే కుతంత్రం నిలబడలేదని.. సాధికారిత పేరుతో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయాలనే బీజేపీ కుయుక్తులు చెల్లలేదని పేర్కొన్నారు. ఎన్డీఏ అధర్మంపై, INDIA ధర్మయుద్ధం గెలిచిందంటూ వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం నిలబడిందన్న షర్మిల.. ఇది భారత దేశ ప్రజల విజయంగా అభివర్ణించారు. బీజేపీ రాజకీయ దురుద్దేశ్యానికి ఇది చరమ గీతమని.. మహిళల పేరుతో రాజకీయాలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీకి చెంపపెట్టుగా షర్మిల పేర్కొన్నారు.
” వీగిపోయింది అతి గతి లేని డీలిమిటేషన్ బిల్లే తప్పా మహిళా బిల్లు కాదు. విపక్షం ఎన్నడూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు. నారీ పేరుతో తెచ్చింది డీలిమిటేషన్ బిల్లు మాత్రమే. ఇవ్వాళ వీగిపోయింది నియోజక వర్గాల పునర్విభజన బిల్లే. ప్రతిపక్షాలు తిప్పికొట్టింది కేవలం రాజ్యాంగాన్ని మార్చే కుట్రనే. మహిళా బిల్లుకు ఆమోదం దక్కింది 2023లోనే. ప్రతిపక్షాలపై బురదజల్లడం మాని ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు-2023 తక్షణం అమలు చేయాలి. బీజేపీకి మహిళలపై చిత్తశుద్ధి ఉందన్న మాటను నిరూపించుకోవాలి. 543 స్థానాలకు వెంటనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.” అంటూ షర్మిల డిమాండ్ చేశారు.
మరోవైపు మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లుపై లోక్‌సభలో శుక్రవారం ఓటింగ్ జరిగింది. ఇందులో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొనగా.. బిల్లుకు అనుకూలంగా 298 మంది ఓటేశారు. వ్యతిరేకంగా 230 మంది ఓటేయటంతో.. మూడింట రెండొంతుల మెజారిటీని కేంద్రం సాధించలేకపోయింది. దీంతో బిల్లు వీగిపోయినట్లు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. దీంతో డీలిమిటేషన్ బిలు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది.


