తూర్పుగోదావరి జిల్లా గాదరాడ ఓం శివశక్తి పీఠంలో సేవ చేయడానికి అర్చక స్వాములు కావాలంటూ జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటన ఇచ్చారు. నెలకు రూ.20 వేలు గౌరవ వేతనంతో పాటుగా, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆసక్తిగలవారు తమ వివరాలు పంపించాలంటూ ఫోన్ నంబర్, మెయిల్ కూడా జతచేస్తూ ట్వీట్ చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైలైట్:
- అర్చక స్వాములు కావాలి
- జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటన
- నెలకు రూ.20 వేలు జీతం

మరోవైపు గాదరాడలో దేశంలోని ప్రధాన శైవ, వైష్ణవ ఆలయాలు, శక్తిపీఠాల నమూనాలు కొలువయ్యాయి. ఓం శివశక్తి పీఠం పేరుతో బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు దీనిని ఏర్పాటు చేయించారు. స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన బలరామకృష్ణ.. ఊరిలో చెప్పుకోదగ్గ ఆలయం లేదని భావించారు. ఊరి ప్రజలు గర్వపడేలా ఓ గుడిని నిర్మించాలని సంకల్పించారు. ఏ ఆలయాన్ని నిర్మించాలనే దానిపై చాలా మంది మఠాధిపతులు, గురువుల సలహాలు తీసుకున్నారు. కొంతమంది శివాలయం, మరికొందరు వైష్ణవ క్షేత్రం, ఇంకొందరు అమ్మవారికి ఆలయం నిర్మించాలని సూచించారట.
దీంతో అందరి సలహాలను పరిగణనలోకి తీసుకున్న బత్తుల బలరామకృష్ణ.. నాలుగేళ్లు శ్రమించి ఓం శివశక్తి పీఠం పేరుతో 54 ఆలయాలను ఒకేచోట నిర్మింపజేశారు.యాభై నాలుగు దేవాలయాలలో.. ఎనభై నాలుగు దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు. కైలాస మహాక్షేత్రాలుగా (21), శక్తిపీఠాలుగా (18), వైకుంఠ క్షేత్రాలుగా (15) విభజించారు. సౌరాష్ట్రలోని సోమనాథ లింగం, శ్రీశైలం మల్లికార్జున లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వరలింగం…ఇలా పన్నెండు లింగాలూ కొలువయ్యాయి. అలాగే సద్గురు సాయిబాబా మందిరం, భద్రాది, అన్నవరం, యాదాద్రి, అరసవల్లి నమూనా ఆలయాలను ఏర్పాటు చేయించారు.
శైవ క్షేత్రాలలో శైవాగమం ప్రకారం.. వైష్ణవ ఆలయాల్లో వైఖాసన ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఆలయంలో పనిచేసేందుకు అర్చక స్వాములు కావాలంటూ బత్తుల బలరామకృష్ణ ప్రకటన ఇచ్చారు. ఆసక్తి గలవారు తమ వివరాలు తెలియజేసేందుకు వారం రోజుల సమయం ఉంది.


