‘cockroach_janasena_party వంటి ఫేక్ సోషల్ మీడియా అకౌంట్‌ల ద్వారా ప్రభుత్వం విద్యాకానుక కిట్ల పంపిణీని నిలిపివేసిందని జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. ఇదే విషయం పై గతంలో కొంతమంది ఫేక్ ప్రచారం చేయగా మే 24వ తేదీన ప్రభుత్వ పరంగా పూర్తి వివరాలతో ఖండన ఇచ్చారు. అయినా ఇప్పుడు ఫేక్ అకౌంట్లతో మళ్ళీ జరుపుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. యుద్ధప్రభావం, అంతర్జాతీయ రవాణా అడ్డంకులు, ముడిసరుకుల ధరల పెరుగుదల వల్ల సరఫరాలో స్వల్ప జాప్యం జరుగుతోందే తప్ప పథకం ఎక్కడా నిలిపివేయలేదు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ ఖచ్చితంగా అందుతాయి, మిగిలిన వస్తువులను తదుపరి మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నాటికి అందజేస్తారు. విద్యార్థుల విద్యా పథకాలపై ఇలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేస్తూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వారిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు’ అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది.
గతంలో కూడా విద్యార్థి మిత్ర పథకాన్ని నిలిపివేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి లోకేష్ స్పందించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫామ్, షూ, బ్యాగ్‌లు, పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదనడం పూర్తిగా అవాస్తవం అన్నారు.. ఇదంతా వందశాతం అబద్ధమన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా వంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయన్నారు. అందుకే విద్యార్థులకు యూనిఫామ్ క్లాత్, బ్యాగులు, బూట్ల సరఫరా చేసేందుకు నెల రోజులు ఆలస్యమవుతుందని విద్యాశాఖ తెలిపిందన్నారు.
రాష్ట్రలో విద్యార్థులందరికీ జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ ఖచ్చితంగా అందుతాయని మంత్రి లోకేష్ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌లో మిగిలిన యూనిఫామ్, ఇతర వస్తువులు సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయడానికి తయారీ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు అన్నారు. వాస్తవం ఇదైతే విష ప్రచారాలతో ఫేక్ టీములతో ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ పరిణామాల కారణంలో కిట్లు పంపిణీ కాస్త ఆలస్యం అవుతుందని అధికారులు నిజాయితీగా ప్రకటిస్తే.. దానిని వక్రీకరించి, అసలు కిట్ల పంపిణీ ఉండదంటూ విషప్రచారం చేయడం దారుణమన్నారు.


