Nimmala Ramanaidu Tractor Farming: ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ట్రాక్టర్ స్టీరింగ్ పట్టారు. సొంత నియోజకవర్గమైన పాలకొల్లులోని తన నివాసం నుంచి 7 కిలోమీటర్లు సైకిల్‌పై సొంత ఊరు ఆగర్తిపాలెం వెళ్లారు. అక్కడ తన పొలానికి వెళ్లి దుక్కి దున్నారు. అలాగే ఆయన రొయ్యల చెరువుల్ని కూడా పరిశీలించారు.. అనంతరం రొయ్యలకు మేత కూడా వేశారు. అక్కడ వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని మళ్లీ సైకిలపై వచ్చారు.
హైలైట్:
- ఏపీ మంత్రి రామానాయుడు వ్యవసాయం
- ట్రాక్టర్ సాయంతో దుక్కి దున్నిన మంత్రి
- రొయ్యల చెరువులో మేత వేసి రామాానాయుడు

ఆదివారం సెలవు రోజు కావడంతో మంత్రి నిమ్మల రామానాయుడికి కొంత సమయం దొరికింది. అందుకే ఆయన తనకు ఇష్టమైన వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. తన సొంత వ్యవసాయ పనుల్లో అందరితో కలిసి పనిచేయడం ఎంతో సంతృప్తిగా ఉందని చెబుతున్నారు. అలాగే ఆదివారం షెడ్యూల్ ప్రకారం గోదావరి డెల్టాకు సాగు నీరు విడుదల చేశామన్నారు. రైతులందరూ ముందస్తుగా వరి నాట్లు వేసేందుకు సిద్ధం కావాలని.. ఎల్‌నినో కారణంగా సాగు నీటిని సక్రమంగా వినియోగించుకుంటూ జల సంరక్షణ చేపట్టాలని కోరారు మంత్రి నిమ్మల రామానాయుడు. పొలంలో వ్యవసాయం పనుల పూర్తి చేసుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు తిరుగు ప్రయాణంలో కూడా సైకిల్‌పై ఇంటికి వెళ్లారు. నిమ్మల రామానాయుడికి వ్యవసాయం చేయడం ఇష్టం.. ఆయన తన సొంత పొలాన్ని ప్రతి ఏటా సాగు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా బిజీగా ఉన్నా సరే సమయం దొరికినప్పుడల్లా సొంత ఊరికి వెళ్లి వ్యవసాయ పనులు చేస్తుంటారు.
‘ఆదివారం తెల్లవారుజామున పాలకొల్లు నుంచి 7 కిలోమీటర్లు సైకిల్ పై సొంతూరు అగర్తిపాలెం వెళ్లి సొంత రొయ్యల చెరువులో మేత వేసి రొయ్య ఎదుగుదలను పరిశీలించడం జరిగింది. వరి పొలంలో కార్మికులతో కలిసి ట్రాక్టర్ తో దుక్కి దున్నడం జరిగింది. అనంతరం గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసి అభివృద్ధి చేస్తున్న హిందూ స్మశాన వాటిక పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం తిరిగి 7 కిలోమీటర్లు సైకిల్ పై పాలకొల్లు రావడం జరిగింది. ఈ రోడ్ లో జలజీవన్ మిషన్ మంచినీటి పైపులైన్ రోడ్డు వెంబడి నుంచి వెళుతుండడం చూసి భవిష్యత్తులో పైపులైను మరమ్మత్తు పనులు చేపట్టాల్సి వస్తే మంజూరైన సిమెంట్ రోడ్ కు ఇబ్బంది లేకుండా పైప్ లైన్ నడిచేలా చూడాలని ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది. ఆదివారం సెలవు రోజున కొద్దిపాటి సమయం దొరకడంతో సొంత వ్యవసాయ పనుల్లో పాల్గొనడం ఎంతో సంతృప్తి ఆనందం కలిగింది’ అంటూ మంత్రి రామానాయుడు ట్వీట్ చేశారు.


