దక్షిణ కోస్తా రైల్వేజోన్‌లోకి విశాఖపట్నం, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్ల కలిపి పని చేస్తోంది. అంతేకాదు ఏకంగా 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ కనుమరుగైంది. విశాఖపట్నం కేంద్రం రైల్వేజోన్ ఏర్పాటు కానుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి.. దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు, తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో ఉన్న వాల్తేరు డివిజన్‌లో విడగొట్టిప భాగాన్ని కలిపి ఏర్పాటు చేశారు. వాస్తవానికి 2019లోనే రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది.. 2020-2021 బడ్జెట్‌లో కొత్త రైల్వేజోన్ ఆఫీస్, ఇతర భవనాల కోసం రూ.170 కోట్లు కేటాయించారు.. కానీ గత ఐదేళ్లు పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు అప్పగించడంతో జోన్ పనులు ఊపందుకున్నాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ఏప్రిల్ 28న వచ్చి రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ రైల్వేజోన్‌పై కీలక ప్రకటన చేశారు.. మే 5న గెజిట్ నోటిఫికేషన్, ఇవాళ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
‘జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి. దశాబ్దాల మన కల నెరవేరుతోంది. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుంది. మన రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ఇది ఒక కీలక మైలురాయి. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.
రైల్వే జోన్ కార్యకలపాలు ప్రారంభమైనా.. ఉద్యోగులు పాటించాల్సిన నియమ నిబంధనలపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఆయా జోన్లకు సంబంధించి రైల్వే ఉద్యోగులకు ప్రత్యేకంగా నియమావళి ఉంటుంది.. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమైనా.. నిబంధనలపై క్లారిటీ లేదు. ఉద్యోగులు ఎలాంటి మార్గదర్శకాలు అనుసరించాలో తెలియక కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. అయితే మే 30న దక్షిణ కోస్తా జోన్ ఆపరేటింగ్ వింగ్ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖపట్నం డివిజన్ ప్రస్తుతానికి తూర్పు కోస్తా జోన్ సాధారణ నియమాలు పాటించాలని సూచించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు దక్షిణమధ్య రైల్వే జోన్ నియమాలు పాటించాలన్నారు. కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు పాతవాటినే కొనసాగించానల్నారు.


