ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ మీటింగ్ నేపథ్యంలో కవిత విమర్శలు చేశారు. అమరావతిలో రాజధాని కట్టుకోవటం చేతకాదు కానీ.. తెలంగాణ నవనిర్మాణం చేస్తారంట అంటూ సెటైర్లు వేశారు. ఏపీ నేతలు ఆరోగ్యం బాగోలేకపోతే ఇప్పటికీ హైదరాబాద్ వస్తుంటారని.. ముందు వారి సంగతి సరిదిద్దుకోవాలని సూచించారు. రాజకీయ అవసరాల కోసం తెలంగాణపై పడటం మానుకోవాలని సూచించారు.
హైలైట్:
- పవన్ కళ్యాణ్‌పై కల్వకుంట్ల కవిత ఫైర్
- తెలంగాణ నవ నిర్మాణ సభపై విమర్శలు
- అమరావతి కట్టుకోవటం చేత కాదు కానీ.. తెలంగాణ నవ నిర్మాణం చేస్తారా అంటూ సైటెర్లు

“తెలంగాణ నవనిర్మా్ణానికి పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడంట. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తోంది. మీ అమరావతిలో, మీ సెక్రటేరియట్లో, మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కిందకు నీళ్లు రాకుండా చూసుకోండి ఫస్ట్. ప్రతీ వానాకాలం అక్కడ రాజధాని మునుగుతుంది. ఇది ఆంధ్ర ప్రజలకు ఎంత అవమానం. ఆంధ్రా నాయకులు ఆరోగ్యం బాగాలేకపోతే ఇప్పటికీ కూడా హైదరాబాద్ వచ్చి ఆపరేషన్లు చేయించుకుంటారు. 12 ఏళ్లు అయ్యింది.. అక్కడే ఆస్పత్రి కట్టుకోవచ్చుగా. మీరంటే కార్లు ఉన్నాయ్ వచ్చేస్తారు. ప్రజల సంగతి ఏంటి? వాళ్లు ఎక్కడికి పోవాలి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పోవాలి. ఇన్నేళ్లయినా కూడా మీ ప్రజలకు కావాల్సిన ఆస్పత్రులు కట్టరు. వసతులు కల్పించరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడి ఏడుస్తారా”.. అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్, పాశం యాదగిరి ఓ మాట మాట్లాడితే.. ఆంధ్రా పోలీసులు మా మేధావుల ఇళ్లకు వస్తున్నారని కవిత విమర్శించారు. ఇలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనుకున్నది చెప్పే హక్కు తమకు ఉందని.. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ముంటే ఎదుర్కొనాలని సవాల్ విసిరారు.
అమరావతిలో రాజధాని కట్టుకోవటం చేత కాదు కానీ.. ఇక్కడికి వచ్చి తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అని కవిత విమర్శించారు. “మా పని మేము చేసుకుంటాం.. మా నిర్మాణం మేము చేసుకుంటాం.. మా కథలు మేం పడ్తం.. రాష్ట్రం విడిపోయినా, ప్రజలు విడిపోలేదు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోండి. అలా చేస్తే మంచిగా ఉండదు. ఈసారి మూతిపళ్లు రాలిపోతాయ్” అంటూ కల్వకుంట్ల కవిత వార్నింగ్ ఇచ్చారు.


