ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. సోమవారం రోజున ముంబయిలో పర్యటించిన మంత్రి నారా లోకేష్.. ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్ ట్రంక్ నూతన క్యాంపస్ విశాఖలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఉన్న అవకాశాలను వివరించారు. మరోవైపు గతేడాది అక్టోబర్ నెలలోనూ రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. తాజాగా రెండోసారి భేటీ అయ్యి.. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు గురించి చర్చించారు.
హైలైట్:
- ఏపీకి ఎయిర్ ట్రంక్ సంస్థ!
- ముంబయిలో సీఈవో రాబిన్ ఖుదాతో లోకేష్ భేటీ
- విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు ఆహ్వానం

విశాఖపట్నంలో ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీ కనెక్స్ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. సాగరతీరం విశాఖపట్నంలో 6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనేదే తమ ప్రభుత్వం లక్ష్యమని.. దీనికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు నారా లోకేష్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎయిర్ ట్రంక్ సంస్థ కొత్త క్యాంపస్ విశాఖలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే మరే ఇతర ప్రాంతానికి లేని విధంగా విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు, అనుసంధానం ఉందని గుర్తు చేశారు. డేటా సెంటర్ల కోసం విద్యుత్ కావాల్సి వస్తుందని.. ఇందుకోస రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్లు కూడా ఏపీలో సిద్ధమవుతున్నాయని నారా లోకేష్ వివరించారు.
మరోవైపు గతేడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించారు నారా లోకేష్. ఈ సందర్బంగా తొలిసారిగా ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో భేటీ అయ్యారు. అనంతరం ఎయిర్ ట్రంక్ ప్రతినిధులతో ఏపీ బృందం పలుసార్లు చర్చలు జరిపింది. ఈ సందర్భంగా భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత ఏపీలో క్యాంపస్ ఏర్పాటుపై ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా ఎయిర్ ట్రంక్ ప్రతినిధులు ఏపీ ఉన్నతాధికారులకు తెలియజేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎయిర్ ట్రంక్ భారత్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో.. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయాలంటూ నారా లోకేష్ సీఈవో రాబిన్ ఖుదాను కలిశారు. మరోవైపు ఎయిర్ ట్రంక్ సంస్థ ఆసియా పసిఫిక్, మధ్య ప్రాచ్య దేశాలలో కార్యకలాపాలు సాగిస్తున్న ఓ డేటా సెంటర్ కంపెనీ. ఇది క్లౌడ్, ఏఐ కంపెనీల కోసం హైపర్ స్కేల్ డేటా సౌకర్యాలను అందిస్తుంటుంది.


