ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ చేపడతారు. మరోవైపు షెడ్యూల్ ప్రకటించటంతో ఇవాళ్టి నుంచే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలుకు జూన్ 8వ తేదీ వరకూ గడువు ఉండగా.. జూన్ 11వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. మరోవైపు ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. పెద్దలసభకు వెళ్లే ఆ నలుగురు ఎవరా అనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
హైలైట్:
- ఏపీలో రాజ్యసభ ఎన్నికలు
- నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
- జూన్ 18వ తేదీన ఎన్నికలు

మరోవైపు ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీడీపీలో రాజ్యసభ సీటును ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. సీటు కోసం ఇప్పటికే పలువురు నేతలు లాబీయింగ్ మొదలుపెట్టారు. రాజ్యసభ సీటు కోసం పలువురు సీనియర్ నేతలు, సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందించిన వారు పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్దల సభకు వెళ్లేందుకు పలువురు నేతలు ఇప్పటికే లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఆమెకు అవకాశం ఉంటుందా?
మరోవైపు ఇటీవల జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల నుంచి మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వే్ చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం ఈ రాజ్యసభ ఎన్నికల నుంచే అమలు చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళకు రాజ్యసభ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నుంచి అని నారా లోకేష్ ప్రకటించినప్పటికీ.. తక్షణమే అమలు చేస్తే మహిళా ఓటర్ల మద్దతును పదిలం చేసుకోవచ్చని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు నాలుగు రాజ్యసభ సీట్లలో ఈసారికి బీజేపీకి అవకాశం ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈసారికి రాజ్యసభ సీటు అడగవద్దని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానాన్ని కోరినట్లు పార్టీ వర్గాలు చెప్తు్న్నాయి. గతంలో రెండు రాజ్యసభ స్థానాలను బీజేపీకి ఇచ్చామని.. ప్రస్తుతం టీడీపీ నుంచి ఎక్కువ మంది ఆశిస్తున్న నేపథ్యంలో ఈసారికి సీటు అడగొద్దని కోరినట్లు తెలిసింది. అలాగే కూటమిలోని మరో భాగస్వామ్య పార్టీ జనసేనకు ఒక సీటు ఇవ్వాల్సిన సంగతిని వివరించినట్లు సమాచారం. దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. నాలుగు సీట్లలో మూడు టీడీపీ, ఒకటి జనసేన తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
రాజ్యసభ రేసులో పలువురు సీనియర్ నేతలు..
మరోవైపు రాజ్యసభ స్థానం కోసం టీడీపీలోని పలువురు సీనియర్ నేతలు పోటీపడుతున్నారు. వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, కంభంపాటి రామ్మోహన్ రావు, భాష్యం రామకృష్ణ వంటి నేతలు పోటీ పడుతున్నారు. అలాగే సిట్టింగ్ ఎంపీ సానా సతీష్ కూడా మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. వీరితో పాటుగా చింతకాయల విజయ్, లోకేష్ సన్నిహితుడు రాజేష్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇక రాయలసీమ నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఈ ప్రాంతం నుంచి వైసీపీకి రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ఎంపీలు ఉండటంతో.. టీడీపీ నుంచి కూడా ఈ సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మొత్తంగా రాజ్యసభ స్థానం కోసం పలువురు సీనియర్లు, జూనియర్లు పోటీపడుతున్న తరుణంలో.. నారా లోకేష్ ఆశావహుల జాబితాను సిద్ధం చేస్తారని, వీటిలో నుంచి తగిన పేర్లను చంద్రబాబు ఎంపిక చేస్తారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరా నలుగురు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


