ఏపీలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు ఉండగా.. వాటిని 14కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మరో ఏడుచోట్ల కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో ఐదు చోట్ల విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదించగా.. కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో 600 ఎకరాల్లో డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.

మరోవైపు కొత్త ఎయిర్‌పోర్టును ఒంగోలు దగ్గరలో నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కొప్పోలు, ఆలూరు, అల్లూరు వంటి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు అయితే అనువుగా ఉంటుందని రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు కూడా ఇటీవల స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. అయితే ఈ ప్రాంతంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయడానికి ఈ స్థలం సరిపోతుందా, ఎంతవరకూ అనుకూలంగా ఉందనే దానిపై టెక్నికల్‌గా అధ్యయనం జరపనున్నారు. నేల పటుత్వం సహా ఇతరత్రా అంశాలపై సాంకేతిక పరిశీలన జరిపిన తర్వాతే ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేసే ప్రాంతంపై క్లారిటీ వస్తుంది.
మరోవైపు ఒంగోలు విమానాశ్రయం కోసం.. గతంలో 3,150 ఎకరాల భూమి కేటాయించారు. వాటికి సరిహద్దులు కూడా నిర్ణయించారు. ఇందులో 3000 మీటర్ల మేర రన్‌వే నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఈ భూములలో ఎక్కువగా వాన్‌పిక్ భూములు ఉండటం.. ఆ తర్వాతి కాలంలో వాటిని కూడా ఈడీ అటాచ్ చేయడంతో డొమెస్టిక్ టెర్మినల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. చిన్న విమానాలు దిగే విధంగా 600 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు,


