సోషల్ మీడియాలో జనసేన పార్టీపై, కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న ప్రచారం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. కొంతమంది మూర్ఖులు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుష్ర్పచారాలను జనసేన శ్రేణులు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. పవన్ కళ్యాణ్ ఏరోజూ పదవుల కోసం ఆలోచించలేదన్న నాదెండ్ల మనోహర్.. రాష్ట్ర ప్రజల బాగుకోసమే ఆయన ఆలోచిస్తారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ ఆలోచనలు, చంద్రబాబు విజన్ అవసరమని అభిప్రాయపడ్డారు.

మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాదెండ్ల మనోహర్.. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి అధ:పాతాళానికి పడిపోయిందని విమర్శించారు. నాయకుడికి విజన్ లేకపోతే ప్రజలు ఏ విధంగా నష్టపోతారనే దానికి వైసీపీ పాలనే నిదర్శనమన్నారు. జనసేన ప్రస్థానంలో ప్రజా సమస్యలపై పోరాటమే తప్ప ఏరోజూ రాజకీయ, వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరమని గుర్తించే ప్రజలు కూటమిని గెలిపించారని తెలిపారు.
ఈ మధ్య కొంత మంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పదవి గురించి మాట్లాడుతున్నారన్న నాదెండ్ల మనోహర్.. పవన్ కళ్యాణ్ ఏనాడూ పదవుల కోసం ఆలోచించలేదని, పదవుల గురించి మాట్లాడలేదన్నారు. ధైర్యంగా ప్రజల కోసం నిలబడాలని.. పార్టీ కోసం పని చేయాలని, అప్పుడు పదవులే మన దగ్గరకు వస్తాయనేది పవన్ సిద్ధాంతమని నాదెండ్ల మనోహర్ చెప్పారు. కొంత మంది మూర్ఖులు సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని.. పదవి వస్తేనే పని చేస్తామని పవన్ కళ్యాణ్ ఏనాడు చెప్పలేదన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కార్యకర్తల కుటుంబాలకు జనసేన అండగా నిలిచిందని.. రాజకీయాల్లో మార్పు కోసం నిజాయితీగా, నిబద్ధతతో పని చేసిందని అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న వారు అది గుర్తుంచుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి కూటమికి పిలుపునిచ్చిన సంగతిని గుర్తుచేసిన నాదెండ్ల మనోహర్.. అరోజు ఎలాంటి రాజకీయ లబ్ది కోసమూ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదన్నారు. మా బలం ఏంటి? మీ బలం ఏంటి? అని మాట్లాడలేదని.. రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే నిలబడ్డారని మనోహర్ వివరించారు.


