Supreme Court Ys Jagan Assets Case: మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీంకోర్టులో రిలీప్ దక్కింది. జగన్ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని.. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయలేమని.. బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవని వ్యాఖ్యానించింది.
హైలైట్:
- ఏపీ మాజీ సీఎం జగన్‌కు సుప్రీం కోర్టులో ఊరట
- రఘురామ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ధర్మాసనం
- మరో పిటిషన్ వెనక్కు తీసుకున్న రఘురామ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణను వేరే రాష్ట్రానికి మార్పు చేయాలని రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో పిటిషన్‌లు వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారణ చేయగా.. ఆ తర్వాత జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది.
జగన్ ఆస్తుల కేసులో గత 12 ఏళ్లుగా విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని.. ఒక్క డిశ్ఛార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని రఘురామ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు గతంలోనే కేసుల బదిలీ సాధ్యం కాదని చెప్పిందని.. కాబట్టి సుప్రీం కోర్టు ఈ కేసుల్ని పర్యవేక్షించాలని కోరుతున్నామన్నారు. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరపు లాయర్ కోర్టుకు వివరించారు. ఈ కేసుల్ని హైకోర్టు మానిటర్ చేస్తోందని.. ఇంకా కేసులు అక్కడ పెండింగ్‌లో ఉన్నాయని జగన్ తరఫు లాయర్ వాదించారు. ఈ వాదన్ని విన్న ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.


