Andhra Pradesh Government Sewing Machine Free Distribution For Women: ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉపాధి కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది.. ఈ మేరకు దరఖాస్తుల్ని స్వీకరించనుంది. మొత్తం లక్షమందికి ఈ మిషన్లను పంపిణీ చేయనుంది.. అంతేకాదు ఉచితంగా మిషన్లు ఇవ్వడంతో పాటుగా టైలరింగ్‌లో కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ మహిళలకు ఈ మిషన్లను ఉచితంగా పంపిణీ చేస్తారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
- ఏపీలో మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు
- లక్ష మంది పేద మహిళలకు మిషన్లు పంపిణీ
- ఉచితంగా టైలరింగ్‌లో శిక్షణ కూడా ఇస్తారు

2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఈ పథకంలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఈసారి ఈ పథకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలని భావిస్తున్నారు. గతంలో ప్రభుత్వం కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే టైలరింగ్ శిక్షణ ఇచ్చేది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 8 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే 40శాతం మేర శిక్షణ కోసం సెంటర్లను గుర్తించి.. ఒక్కో సెంటర్‌లో 30 నుంచి 50మందికి శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాదు శిక్షణ కార్యక్రమంలో కనీసం 70 శాతం హాజరు ఉన్న వారికే ఉచితంగా కుట్టుమిషన్ అందజేస్తారు. ఈ మేరకు మహిళ హాజరు నమోదుకు ప్రత్యేక యాప్‌ను కూడా సిద్ధం చేశారు అధికారులు. మొత్తం మీద పేద మహిళ కోసం ప్రభుత్వం ఉచిత కుట్టుమిషన్లు అందించబోతోంది. మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటుగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.


